Yoga for Stress Relief : ఒత్తిడి, నిద్రలేమి, పనిభారంతో ఈ రోజుల్లో అనేక మంది నేడు మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వాటిని నిర్లక్ష్యం చేస్తే నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తాయంటున్నారు నిపుణులు. దాంతో బైపోలార్ డిజార్డర్ వచ్చే ప్రమాదం ఉందని ప్రముఖ యోగా గురు, శిరీష అంటున్నారు. అయితే, ఈ సమస్య చిన్నవాళ్లతో పోలిస్తే పెద్ద వయసు వాళ్లలోనే ఎక్కువగా కనిపిస్తుందంటున్నారు. వారిలో అనారోగ్య కారణాల వల్ల కూడా ఈ సమస్యలు రావచ్చంటున్నారు. దీని నుంచి బయటపడటానికి మార్జారాసన మంచి ఉపశమనం లభిస్తుందని ఆమె చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 'మార్జారాసనం' ఎలా వేయాలి. ఈ ఆసనం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో ఇప్పడు తెలుసుకుందాం.
చేసే విధానం : మొదట రెండు మోకాళ్లపై నేల మీద నిలబడాలి, అనంతరం నెమ్మదిగా చేతులను ఫొటోలో చూపిన విధంగా నేలపై ఆనించాలి. ఈ క్రమంలో అరచేతులను భుజాలకు సమాంతరంగా ఉండేట్టుగా చూసుకోవాలి. రెండు కాళ్ల తుంటి భాగాల మధ్య దూరం ఉండేలా చూడాలి. నెమ్మదిగా ఊపిరిని పీల్చుకొంటూ తలను పైకి లేపి వెనకకు వంచుతూ, నాభి భాగాన్ని నేల వైపునకు ఒత్తాలి. అలాగే తీసుకున్న గాలిని బయటకు వదులుతూ... తలను కిందకి వంచి వీపు భాగాన్ని గోపురం ఆకారంలో పైకి లేపి ఉంచాలి. ఎలాంటి కుదుపులు లేకుండా శ్వాసను అనుసంధానం చేస్తూ... అలా చేయగలిగినంతసేపటివరకూ చేయాలి. అనంతరం నెమ్మదిగా శశాంకాసనంలో విశ్రాంతి తీసుకోవాలి.
ఇలా చేయండం వల్ల కలిగే ప్రయోజనాలు : పెద్దవారిలో వచ్చే మూడ్ స్వింగ్స్ తగ్గిస్తుందని శిరీష తెలిపారు. తద్వారా మానసిక ప్రశాంతతనిస్తుందని ఆమె చెబుతున్నారు. శ్వాస వ్యవస్థ మెరుగుపడటంతో పాటుగా మణికట్టు, భుజాలు, వెన్నెముక దృఢత్వాన్ని సంతరించుకుంటాయని పేర్కొన్నారు. జీవక్రియ పెరుగుతుందని తెలిపారు. వీటితో పాటు చిరుధాన్యాలూ, తృణధాన్యాలూ, పండ్లూ, ఆకుకూరలూ నట్స్ వంటివి తీసుకుంటే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆమె సూచించారు.
జాగ్రత్తలు : మెదడు, వెన్నెముక సర్జరీలు అయినవారు ఈ ఆసనానికి దూరంగా ఉండాలని శిరీష సూచిస్తున్నారు.
గోముఖాసనం : ముందుగా కాళ్లను నేలకి సమాంతరంగా చాచి కూర్చోవాలి. అనంతరం కుడి మడమను ఎడమ కాలి తుంటిభాగం తగిలే విధంగా, ఎడమ మడమను కుడికాలి తుంటిభాగానికి దగ్గరగా వచ్చేలా పైన ఫొటోలో చూపిన విధంగా తీసుకురావాలి. అనంతరం రెండు మోకాళ్లు ఒకదానిపై ఒకటి వచ్చేలాగా చూసుకోవాలి. ఒత్తిడి లేకుండా కాళ్లను సర్దుబాటు చేసుకుంటూ వెన్నెముక నిటారుగా ఉంచుకోవాలి. అనంతరం శ్వాస మామూలుగా తీసుకుంటూ... రెండు చేతులను వీపు వెనక్కి పెట్టి రెండు చేతుల వేళ్లనూ లాక్ చేయాలి. చేతులు అందనప్పుడు తువాల లేదా యోగాబెల్ట్ సాయం ద్వారా లాక్ చేసుకోవచ్చు. తల, వెన్నెముక నిదానంగా ఉండేట్లుగా సరిచేసుకోవాలి. ఈ ఆసనంలో నిమిషం పాటు ఉండాలి, కొత్తగా ప్రయత్నించే వారు మాత్రం 40సెకన్లు ఉండి నెమ్మదిగా యథాస్థితికి వచ్చి శవాసనంలో విశ్రాంతి తీసుకోవాలని యోగా గురు వెల్లడించారు.
ఉపయోగాలు : మధుమేహంతో పాటుగా సయాటికా ఉన్నవారికి ఈ ఆసనం బాగా పనిచేస్తుందని శిరీష తెలిపారు. ఈ ఆసనం వేయడం ద్వారా కాలేయానికి మంచిదని వెల్లడించారు. శరీర పైభాగాలకు ఆక్సిజన్ సరఫరా మెరుగ్గా జరుగుతుందని ఆమె తెలిపారు. గూని తగ్గించడంలో ఉపకరిస్తుందంటున్నారు. దీనితో పాటు నల్లద్రాక్ష, అనాస, మెగ్నీషియం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలని శిరీష సూచించారు.
జాగ్రత్తలు : మోకాళ్లు, వెన్నెముక ఆపరేషన్లు చేసుకున్నవారు వీటికి దూరంగా ఉండాలి. పిస్టులా, ఫైల్స్ ఉన్నవారు చేయకపోవడమే మంచిదని యోగా గురువు శిరీష తెలిపారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీ 'గుండె' ఎంతో స్పెషల్- జాగ్రత్తగా కాపాడుకోండి - Take Care of Your Heart
ముక్కులో కండ పెరిగితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?- ఎప్పుడు చికిత్స అవసరం? - Nasal Polyps