Hezbollah Leader Dead : హమాస్, హెజ్బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న భీకరదాడులతో పశ్చిమాసియా అట్టుడుతోంది. బీరుట్‌పై కొనసాగుతున్న దాడుల కారణంగా వేలాది మంది ప్రజలు సుదూరప్రాంతాలకు పారిపోతున్నారు. హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లాను హతమార్చటం తమ యుద్ధ లక్ష్యాల్లో ఒకటని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. నస్రల్లా మరణాన్ని నాలుగు దశాబ్దాల ఉగ్రవాదానికి మూల్యంగా బైడెన్ అభివర్ణించారు. మరోవైపు ఇజ్రాయెల్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా హూతీ రెబల్స్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని ఐడీఎఫ్ కూల్చివేసింది.
అదే మా లక్ష్యం
హెజ్బొల్లా లక్ష్యంగా దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ స్పష్టం చేయగా, పాలస్తీనాకు మద్దతు కొనసాగుతుందని హెజ్బొల్లా ప్రకటించింది. నస్రల్లాను హతమార్చడం యుద్ధలక్ష్యాలను సాధించటానికి అత్యవసరమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఇజ్రాయెల్ రక్షణకు హెజ్బొల్లా అగ్రశ్రేణి కమాండర్ల హతం సరిపోదనీ, అందుకే నస్రల్లా లక్ష్యంగా దాడులు చేసినట్లు తెలిపారు. ఇజ్రాయెల్‌ను సర్వనాశనం చేయాలన్న కుట్రకు నస్రల్లా రూపకర్తగా పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులతో ప్రాంతీయ యుద్ధం తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉగ్రపాలకు జరిగిన న్యాయం
హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా మృతి నాలుగు దశాబ్దాల ఉగ్రపాలనకు జరిగిన న్యాయమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభివర్ణించారు. గతేడాది అక్టోబర్ 7దాడి తర్వాత హమాస్‌తో నస్రల్లా చేతులు కలిపారని అన్నారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నార్తర్న్ ఫ్రంట్ ఏర్పాటు చేశారన్న బైడెన్ అతడి పర్యవేక్షణలో వేలాదిమంది అమెరికన్ పౌరుల మరణాలకు హెజ్బొల్లా కారణమైందని ఆరోపించారు. అస్థిర పరిస్థితుల కారణంగా లెబనాన్ నుంచి తమ రాయబారులు కుటుంబాలతోసహా వెనక్కి రావాలని అమెరికా ప్రభుత్వం సూచించింది. పౌరులెవరూ లెబనాన్‌కు వెళ్లొద్దని హెచ్చరించింది.
ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా నిరనసలు
ఇదిలా ఉండగా నస్రల్లాను చంపిన ఇజ్రాయెల్‌తోపాటు అమెరికాకు వ్యతిరేకంగా యెమెన్, ఇరాక్, ఇరాన్, పాలస్తీనాలో నిరనసలు జరిగాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మరోవైపు హెజ్బొల్లా అధినేత నస్రల్లా మృతిపై స్పందించిన ఇరాన్ సుప్రీం లీడల్ అయతొల్లా అలీ ఖమేనీ, వందలాది లెబనాన్ పౌరుల ఊచకోతతో ఇజ్రాయెల్ క్రూర స్వభావం బహిర్గతమైందన్నారు. దోపిడీ దేశాల స్వభావం, మూర్ఖపు విధానాలు బయటపడ్డాయని అమెరికాను ఉద్దేశించి ధ్వజమెత్తారు. గాజాలో ఏడాది కాలంగా మహిళలు, చిన్నారులు, పౌరులను సామూహిక హత్యలు చేసినా, ఇజ్రాయెల్ నేర స్వభావం మారలేదనీ, మధ్యప్రాచ్య ప్రతిఘటనా శక్తులన్నీ హెజ్బొల్లాకు అండగా ఉన్నాయని ఖమేనీ చెప్పారు. కాగా నస్రల్లా మరణం నేపథ్యంలో అప్రమత్తమైన ఇరాన్ సైన్యం ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బీరుట్‌పై దాడిలో హెజ్బొల్లా అధినేతసహా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్‌కు చెందిన డిప్యూటీ కమాండర్ అబ్బాస్ నీలఫరసన్ కూడా మృతి చెందినట్లు తెలిసింది.