US To Boost Military Presence In Mideast : ఇజ్రాయెల్‌పై ఇరాన్ మళ్లీ దాడి చేయొచ్చనే అంచనాల నడుమ పశ్చిమాసియాలో అమెరికా తన సైన్యం మోహరింపుపై ముమ్మర కసరత్తు మొదలుపెట్టింది. పశ్చిమాసియా ప్రాంతానికి యుద్ధ విమానాలతో కూడిన ఒక స్క్వాడ్రన్‌ను పంపుతామని పెంటగాన్ వెల్లడించింది. ఆ ప్రాంతంలో ఎప్పటికీ ఒక విమాన వాహక నౌకను మోహరించి ఉంచతామని ప్రకటించింది. ఇరాన్, దాని మద్దతు కలిగిన మిలిటెంట్ సంస్థల నుంచి ఇజ్రాయెల్‌ను రక్షించేందుకు, పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాల రక్షణ కోసం అమెరికా దళాలు సహాయం చేస్తాయని స్పష్టం చేసింది. ఐరోపా, పశ్చిమాసియాలోని పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో బాలిస్టిక్ క్షిపణి రక్షణ సామర్థ్యం కలిగిన క్రూయిజర్లు, డెస్ట్రాయర్లను మోహరించేందుకు ఇప్పటికే అమెరికా రక్షణమంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆదేశాలు జారీ చేశారని పెంటగాన్ తెలిపింది. భూతలం నుంచి ప్రయోగించే సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలను కూడా కొన్ని ప్రాంతాల్లో మోహరించే అవకాశం ఉందని పేర్కొంది. ఇందుకోసం ‘పాట్రియాట్’ భూతల రక్షణ వ్యవస్థను వాడుతారా? ‘థాడ్’ రక్షణ వ్యవస్థను వాడుతారా? అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ రెండు భూతల రక్షణ వ్యవస్థల్లోనూ మొబైల్ లాంఛింగ్ సిస్టమ్‌ల నుంచి ఇంటర్‌సెప్టర్ క్షిపణులను ప్రయోగించే వీలుంది.
రంగంలోకి యూఎస్ఎస్ అబ్రహం లింకన్!
అతి త్వరలోనే యుద్ధ విమానాల స్క్వాడ్రన్‌ను పశ్చిమాసియాకు పంపుతామన్న పెంటగాన్, వాటిని ఎక్కడ మోహరించనున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మిడిల్ ఈస్ట్‌లో అమెరికాకు ఇప్పటికే చాలా దేశాల్లో సైనిక స్థావరాలు ఉన్నాయి. వాటిలో ఇరాన్‌ను కట్టడి చేసేందుకు ఉపయోగపడే ఏదైనా వ్యూహాత్మక ప్రదేశాన్ని ఇందుకోసం ఎంపిక చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గత కొన్ని నెలలుగా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఉన్న యూఎస్ఎస్ థియోడర్ రూజ్‌వెల్ట్ యుద్ధ నౌక త్వరలోనే అమెరికాకు తిరిగి వెళ్లిపోనుంది. దాని స్థానంలో యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌ను అక్కడికి పంపేందుకు అమెరికా రక్షణమంత్రి ఆదేశాలు జారీ చేశారు. కనీసం వచ్చే ఏడాది వరకు ఇరాన్‌ను కట్టడి చేసేందుకు తమ యుద్ధ నౌకను గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లోనే ఉంచాలని అమెరికా నిర్ణయించిందని అంటున్నారు.
మధ్యధరా సముద్రంపై ఫోకస్
తాజా పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో ఉన్న రెండు అమెరికా నేవీ డెస్ట్రాయర్‌లు ఉత్తరాన ఎర్ర సముద్రం నుంచి మధ్యధరా సముద్రం వైపుగా వెళ్తాయని అమెరికా రక్షణశాఖ వర్గాలు అంటున్నాయి. వాటిలో ఏదైనా ఒకదాన్ని మధ్యధరా సముద్రంలోనే మోహరించే అవకాశం ఉందని తెలిపాయి. తూర్పు మధ్యధరా సముద్ర ప్రాంతంలో ముందు నుంచే అమెరికా నేవీ డెస్ట్రాయర్‌లు యూఎస్‌ఎస్ రూజ్‌వెల్ట్, యూఎస్‌ఎస్ బుల్కెలీ ఉన్నాయి. వాటికి తోడుగా యూఎస్‌ఎస్ వాస్ప్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, యూఎస్‌ఎస్ న్యూయార్క్ అనే ట్రాన్స్‌పోర్ట్ నౌక సైతం అక్కడే మోహరించి ఉన్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు భద్రత కల్పించేందుకు మిడిల్ ఈస్ట్‌లో అమెరికా సైన్యం మరింత యాక్టివ్ కానుంది.