POK People Protests : పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఎట్టకేలకు ఆందోళనలను విరమించారు నిరసనకారులు. తమ డిమాండ్లను పాకిస్థాన్ ప్రభుత్వం అంగీకరించడం వల్ల కొన్ని రోజులుగా చేపడుతున్న ఆందోళనలను మంగళవారం మధ్యాహ్నం నుంచి విరమిస్తున్నట్లు నిరసనకారులు ప్రకటించారు. భద్రతాబలగాల కాల్పుల్లో మరణించిన వ్యక్తుల పట్ల సంతాపంగా శాంతియుత ప్రదర్శన నిర్వహించారు.
తమ డిమాండ్లను ఆమోదించినందుకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ-JAAC నాయకుడు షౌకత్ నవాజ్ మీర్ కృతజ్ఞతలు తెలిపారు. ఆందోళనకారులపై భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మరణించిన ముగ్గురి కుటుంబాలకు ఆర్థిక పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసనల సందర్భంగా అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేసి, కేసులు రద్దు చేయాలని JAAC మరో ప్రతినిధి కోరారు.
అంతకుముందు పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజల ఆందోళనలు తీవ్రమైన వేళ పాకిస్థాన్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పీఓకేకు రూ.2,300 కోట్ల రాయితీ నిధులను విడుదల చేస్తామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోమవారం ప్రకటించారు. 40 కిలోల గోధుమపిండి బస్తా ధరను 1100 రూపాయలు(పాక్ కరెన్సీ) తగ్గిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ ఛార్జీల తగ్గింపునకు కూడా ఆమోదం తెలిపారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం ఆందోళనకారులు తమ నిరసనలను విరమించారు.
అయితే కొన్నినెలలుగా స్థానిక మంగ్లా డ్యామ్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును తమకు ఉచితంగా ఇవ్వాలని స్థానికులు బలంగా డిమాండ్ చేస్తున్నారు. గోధుమలపై రాయితీలు కల్పించాలని కోరుతున్నారు. ఈ ప్రాంతంలో ద్రవ్యోల్బణం అత్యంత తీవ్ర స్థాయికి చేరింది. ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో స్థానిక ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేశారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ-JAAC ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు.
భారత ఎఫెక్ట్
పుల్వామా దాడి తర్వాత పాక్ నుంచి వచ్చే ఎండు ఫలాలు, రాతి ఉప్పు, సిమెంట్, జిప్సమ్ వంటి వాటిపై కస్టమ్స్ డ్యూటీని భారత ప్రభుత్వం 200 శాతం పెంచింది. ఫలితంగా పాక్ నుంచి దిగుమతులు పడిపోయాయి. 2019 తర్వాత కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుతో పాక్ పూర్తిగా వాణిజ్యాన్నే నిలిపివేసింది. ఆ ఆర్థిక ఒత్తిడి పీఓకేపై పరోక్షంగా ప్రతికూల ప్రభావం చూపుతోంది.
ఇరాన్‌తో 'చాబహార్' డీల్- అదే జరుగుతుంది అంటూ భారత్‌కు అమెరికా వార్నింగ్! - US Warns India
ఉత్తర కొరియాలో రెడ్ లిప్‌స్టిక్‌పై నిషేధం- కారణం ఏమిటో తెలుసా? - kim lipstick ban