Russia Attack On Ukraine : రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ బలగాలు చొచ్చుకుపోతున్న వేళ, మాస్కో నుంచి కూడా ప్రతీకార చర్యలు తీవ్రమయ్యాయి. తూర్పు ఉక్రెయిన్‌లోని పోక్రోవ్క్స్ నగరానికి రష్యా సైనిక బలగాలు చేరువయ్యాయి. ఈ నేపథ్యంలో చిన్న పిల్లలు, భారీ సూట్‌కేసులతో పోక్రోవ్స్క్ నగరాన్ని ప్రజలు విడిచి వెళ్లిపోతున్నారు. రష్యా కుర్స్క్ ప్రాంతంలోకి ఉక్రెయిన్ చొరబాట్లు ఉన్నప్పటికీ, రష్యన్ దళాలు చాలా వేగంగా పోక్రోవ్స్క్ నగరాన్ని చుట్టుముట్టాయి. దీంతో పోక్రోవ్స్క్ నగరాన్ని అక్కడి ప్రజలు ఖాళీ చేస్తున్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వ సూచనలతో సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న ఉక్రెయిన్
మంగళవారం నుంచి నగరాన్ని, ఇతర సమీప పట్టణాలు, గ్రామాలను విడిచిపెట్టాలని అక్కడి కుటుంబాలకు ఉక్రెయిన్ ప్రభుత్వం సూచించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. దాదాపు 53 వేల మంది పోక్రోవ్స్క్‌లో నివసిస్తున్నారు. ప్రజలు తమ వస్తువులతో రైళ్లు, బస్సుల్లో ఎక్కారు. సొంత ప్రాంతాన్ని వీడేటపుడు కొందరు కన్నీళ్లు పెట్టుకున్నారు. సామాన్లు తీసుకుపోవడానికి వృద్ధులకు సైనికులు సహాయం చేశారు. రైల్వే కార్మికులు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించారు.
నదులపై ఉన్న వంతెలను ధ్వంసం చేసిన ఉక్రెయిన్ సైన్యం
ఉక్రెయిన్ బలమైన రక్షణాత్మక స్థావరాల్లో పోక్రోవ్స్క్ ఒకటి. డొనెట్స్క్ ప్రాంతంలో కీలకమైన రవాణా కేంద్రంగా పోక్రోవ్స్క్ ఉంది. దానిని స్వాధీనం చేసుకుంటే ఉక్రెయిన్ రక్షణ సామర్ధ్యం తగ్గుతుంది. సరఫరా మార్గాలు చాలా వరకు మూసుకుపోతాయని రష్యా భావిస్తోంది. తద్వారా మొత్తం డొనెట్స్క్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని రష్యా వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు రష్యాలోని కస్క్ ప్రాంతంలోకి చొచ్చుకెళ్లిన ఉక్రెయిన్ సైన్యం అక్కడే తిష్ఠవేసేలా యత్నిస్తోంది. అందుకే నదులపై ఉన్న వంతెలను ఉక్రెయిన్ సైన్యం ధ్వంసం చేసింది. తద్వారా రష్యా సైన్యానికి సరఫరా వ్యవస్థల్ని అడ్డుకోవడం, తమ సైనిక దళాలు అక్కడే తిష్ఠవేసేలా చూసేందుకు ఉక్రెయిన్ యత్నిస్తోంది. ఇరుదేశాల సైన్యాల పరస్పర దాడులతో కస్క్ రీజియన్‌లో ఇప్పటికే లక్ష మందికిపైగా పౌరులను రష్యా సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
రష్యాకు షాక్ - కస్క్లో 1000 చ.కి.మీ ఆక్రమించుకున్న ఉక్రెయిన్! - UKRAIN TAKEN 1000 SQ KM OF KURSK