UK Protests Keir Starmer : బ్రిటన్‌లో మితవాద గ్రూపుల వలస వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో ఆ దేశ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నారు. పలు ప్రాంతాలలో హింసాత్మక ఘటనలపై మంత్రులు, సివిల్ సర్వెంట్లు, నిఘా విభాగం అధికారులు, పోలీసులతో చర్చించనున్నారు. మరోవైపు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హోంమంత్రి కూపర్ హెచ్చరించారు.
ఇదీ జరిగింది
బ్రిటన్‌లో గతవారం ఓ డ్యాన్స్ క్లాస్‌పై దుండగులు దాడి చేసి ముగ్గురు చిన్నారులను కత్తితో పొడిచి చంపారు. ఈ హత్యలు వలసవాదులే చేశారన్న తప్పుడు సమాచారం విస్తృతంగా వ్యాప్తి చెందింది. దీంతో మితవాద గ్రూపులు వలసవాదులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. రోతర్‌హామ్‌లో శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న ఓ హోటల్‌పై దాడి చేశారు. హోటల్‌లోని కిటీకీలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. అనేకచోట్ల దుకాణాలు, వ్యాపార సముదాయాలను లూటీ చేశారు. బెల్‌ఫాస్ట్‌లో ఓ కేఫ్‌కు నిప్పు పెట్టారు. మాంచెస్టర్, నాటింగ్‌హం, బెల్‌ఫాస్ట్, స్టోక్ ఆన్ ట్రెంట్, బ్లాక్‌పూల్, లీడ్స్, బ్రిస్టల్, హల్, లివర్‌పూల్‌లలో నిరసనల సందర్భంగా ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. పోలీసులపైకి రాళ్లు, బాణసంచాను వెలిగించి విసిరారు. ఈ ఘటనల్లో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఇప్పటివరకు 150 మందికిపైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
ఆందోళనకారులపై కఠిన చర్యలు
మితవాదుల ఆందోళనలతో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నారు. తాజా పరిస్థితిపై మంత్రులు, సివిల్ సర్వెంట్లు, నిఘా విభాగం అధికారులు, పోలీసులతో చర్చించనున్నారు. ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కీర్ స్టార్మర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. బ్రిటన్‌లో ఇటువంటి ఘటనలకు జరగలేదని, అందులో భాగస్వామ్యమైన వారు చివరకు చింతిచాల్సి వస్తుందని హెచ్చరించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని బ్రిటన్ హోంమంత్రి కూపర్ హెచ్చరించారు.