Trump Promises US Green Card For Foreigners : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై తన స్వరం మార్చారు. అమెరికా కళాశాలల్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు గ్రీన్ కార్డు ఇవ్వాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. టెక్ పెట్టుబడిదారులతో కలిసి ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ట్రంప్, వలసదారులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో అమెరికాలో వలసదారులపై చేసిన వ్యాఖ్యలకు ఇవి పూర్తి భిన్నంగా ఉన్నాయి.
"యూఎస్ కళాశాలల్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసినవారికి తప్పనిసరిగా గ్రీన్ కార్డు ఇవ్వాలి. గ్రీన్ కార్డు ఇస్తే వారు కచ్చితంగా అమెరికాలోనే ఉండి దేశానికి ప్రయోజనాన్ని చేకూరుస్తారు. ప్రపంచంలోని తెలివైన వ్యక్తులను అమెరికాలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. జూనియర్ కాలేజీల్లో చదివిన వారికి గ్రీన్ కార్డులు ఇవ్వాలి. వలసదారుల విషయంలో నేను గతంలో అనుకున్న నిర్ణయాలను అమలు చేయకపోవడానికి కొవిడ్ మహమ్మారి కారణం. అగ్రశ్రేణి కళాశాలల్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసి యూఎస్‌లో ఉండాలనుకునే విదేశీయుల గురించి నాకు తెలుసు. అయితే వారు వీసాలు పొందలేక స్వదేశాలకు వెళ్లాల్సి వస్తుంది." అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
వలసదారులపై తీవ్ర విమర్శలు
దేశంలో అక్రమంగా ఉంటున్న వలసదారులు నేరాలకు పాల్పడుతున్నారని, ఉద్యోగాలు, ప్రభుత్వ వనరులను దోచుకుంటున్నారని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. వలసదారులు దేశ రక్తాన్ని విషపూరితం చేస్తున్నారని విమర్శించారు. తాను మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే దేశ చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ చేపడతానని పేర్కొన్నారు. కొన్ని ముస్లిం మెజారిటీ దేశాల నుంచి అమెరికాలోకి ప్రవేశించే వలసదారులపై నిషేధం విధిస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు.
అంతకుముందు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వలసదారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నిస్తున్నారు. తన పాలనా కాలంలో ట్రంప్, కుటుంబ ఆధారిత వీసాలు, వీసా లాటరీ ప్రోగ్రామ్ వంటి చట్టపరమైన వలసలపై నియంత్రణలకు కూడా ప్రతిపాదించారు. 2017లో పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే 'బై అమెరికన్ అండ్ హైర్ అమెరికన్' అనే నినాదాన్ని ఇచ్చారు. దేశ కార్మికుల ప్రయోజనాల కోసం అత్యధిక జీతం, నైపుణ్యం కలిగిన దరఖాస్తుదారులకు మాత్రమే వ్యాపార వీసాలు జారీ చేసేలా సంస్కరణలను సూచించమని క్యాబినెట్ సభ్యులను ఆదేశించారు. విదేశీ ఉద్యోగులను తాత్కాలికంగా నియమించుకోవడానికి కంపెనీలు చేపట్టే H1-B ప్రోగ్రామ్‌ను గతంలో ట్రంప్ చాలా చెడ్డదిగా అభివర్ణించారు. తక్కువ వేతనానికి విదేశీ ఉద్యోగులను పొందడానికి టెక్ కంపెనీలకు H1-B ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందని ఆరోపించారు.
'భారత్-పాక్ ప్రత్యక్ష చర్చలకు మద్దతు- సమయాన్ని వారే నిర్ణయించాలి'- అమెరికా