Donald Trump invites China President : డొనాల్డ్ ట్రంప్ త్వరలో అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టనుండగా అందుకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చేనెల 20న ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌కు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయవర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ పలు అంతర్జాతీయ మీడియాల్లో కథనాలువెలువరించాయి. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన నవంబర్ మొదట్లోనే జిన్‌పింగ్‌కు ఆహ్వానం పంపినట్లు పేర్కొన్నాయి. అయితే ట్రంప్ ఆహ్వాన్ని జిన్‌పింగ్ అంగీకరించారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ఈ ఆహ్వానంపై వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం స్పందించలేదు.
మరోవైపు ఇటీవల ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైనా అధ్యక్షుడితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఈ మధ్యే తాము మాట్లాడుకున్నట్లు ట్రంప్ తెలిపారు. తాను బాధ్యతలు చేపట్టాక చైనా దిగుమతులపై 10శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్ పేర్కొనగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దీటుగా స్పందించారు. చైనా- అమెరికా మధ్య టారిఫ్, టెక్ యుద్ధాల్లో విజేతలు ఉండరని వ్యాఖ్యానించారు.
'ట్రంప్‌ను కలవడానికి వరల్డ్ లీడర్లు క్యూ కడుతున్నారు'
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలవడానికి ప్రపంచ నేతలు వరుసలో ఉన్నారని ట్రంప్ ట్రాన్సిషన్ ప్రతినిధి కరొలిన్ లీవిట్ అన్నారు. ఎందుకంటే ట్రంప్ మళ్లీ అధికారంలోకి వస్తారని వారికి తెలుసునన్నారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు ఉన్న బలం వల్ల శాంతిని పునరుద్ధరిస్తారని కూడా వారికి తెలుసునని లీవిట్ పేర్కొన్నారు.
గత నెలలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ భారీ విజయం సాధించారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో 295 ఎలక్టోరల్ ఓట్లు సాధించి, ప్రత్యర్థి కమలా హారిస్‌పై(226 ఎలక్టోరల్ ఓట్లు) గెలుపొందారు. ట్రంప్‌లా ఒకసారి అధ్యక్షుడిగా పనిచేసి ఓడిపోయి మళ్లీ గెలవడం అమెరికా చరిత్రలో రెండో సారి మాత్రమే. మొట్టమొదటగా ఇలా గ్రోవర్ క్లీవ్‌లాండ్‌కు జరిగింది. 1884లో అధ్యక్షుడిగా ఎన్నికైన క్లీవ్లాండి అనంతరం ఓడిపోయి, 1892లో మళ్లీ గెలిచారు. ట్రంప్ 2016 నుంచి 2020 వరకు అధ్యక్షుడిగా ఉన్నారు.