Red Lipstick Ban In North Korea : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) పేరు చెప్పగానే కఠినమైన చట్టాలు, నిబంధనలు గుర్తుకు వస్తాయి. చాలా విచిత్రమైన నిబంధనలతో కొరియా ప్రజల వ్యక్తిగత అభిరుచులను సైతం ఆయన శాసిస్తుంటారు. సౌందర్య ఉత్పత్తుల దగ్గర నుంచి దుస్తుల వరకు అన్నింటిపైనా ఆంక్షలు అమలు చేస్తున్నారు. చివరకు హెయిర్‌స్టైల్ కూడా కిమ్ ప్రభుత్వం చెప్పినట్లే చేయించుకోవాలని శాసిస్తున్నారు. తాజాగా కొరియన్ మహిళలను రెడ్ లిప్‌స్టిక్ వాడడంపై నిషేధం విధిస్తూ ఒక సరికొత్త నిబంధనను తీసుకొచ్చారు.
కారణం ఏమిటి?
ఉత్తర కొరియా అధినాయకత్వం రెడ్ లిప్‌స్టిక్‌ను పెట్టుబడిదారీ విధానానికి సంకేతంగా భావిస్తోంది. కనుక మహిళలు రెడ్ లిప్‌స్టిక్ వేసుకోవడం తమ కమ్యూనిజం భావజాలానికి పూర్తి వ్యతిరేకమని తేల్చేసింది. ఇప్పటికే నార్త్ కొరియాలో మేకప్‌పై నిషేధం ఉంది. ఎందుకంటే మేకప్ అనేది పూర్తిగా పాశ్చాత్య సంస్కృతిగా ప్రభుత్వం భావిస్తోంది. కనుక మేకప్‌ను అనుమతిస్తే ప్రజలు క్రమంగా పాశ్చాత్య సంస్కృతికి, భావజాలానికి ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందని కిమ్ జోంగ్ ఉన్ భావిస్తున్నారు. ప్రజలు అనవసర ఆడంబరాలకు పోకుండా, చాలా సహజంగా ఉండాలని కిమ్ ప్రభుత్వం చెబుతోంది. అందులో భాగంగానే తాజాగా రెడ్ లిప్‌స్టిక్‌పై బ్యాన్ విధించింది.
లిస్ట్ పెద్దదే!
ఉత్తర కొరియా అనేక ఫ్యాషన్ బ్రాండ్లపై కూడా నిషేధం విధించింది. ముఖ్యంగా శరీరానికి అతుక్కుపోయినట్లుగా ఉండే నీలిరంగు జీన్స్‌ను ఎవరూ ధరించకూడదని స్పష్టం చేసింది. కొన్ని రకాల ఆభరణాలపై, కొన్ని రకాల హెయిర్ స్టైళ్లపై కూడా నిషేధం ఉంది. కనుక మహిళలు, పురుషులు అందరూ కిమ్ ప్రభుత్వం అనుమతించిన విధానంలోనే జుట్టును కత్తిరించుకోవాలి.
'నా స్టైలే సెపరేటు'
కిమ్ జోంగ్ ఉన్ తనను మరెవరూ అనుకరించకూదనే ఉద్దేశంతో కొన్ని ప్రత్యేకమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ రూల్స్ ప్రకారం, కిమ్ జోంగ్ ఉన్ తరహాలో మరెవరూ జుట్టును కత్తిరించుకోకూడదు. నలుపు రంగు ట్రెంచ్ కోట్లు కూడా ఎవరూ ధరించకూడదు.
నిబంధనలు ఉల్లంఘిస్తే!
కిమ్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఎవరైనా ఉల్లంఘిస్తే, వారికి కఠినమైన శిక్షలు విధిస్తారు. ఒక్కోసారి భారీ జరిమానా కూడా వసూలు చేస్తారు. జీన్స్ ధరించి ఎవరైనా రోడ్లపై కనిపిస్తే, వారిని అక్కడే ఆపి మరోసారి వేసుకోవడానికి వీల్లేకుండా దానిని కత్తిరిస్తారు. జుట్టు విషయంలోనూ అంతే.
హింసతో దద్దరిల్లుతున్న POK- 'భారత్ వెంటనే జోక్యం చేసుకోవాల్సిందే!' - POK Protest Against Pakistan