South Korean President : దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు పదవీ గండం తప్పింది. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు ప్రవేశ పెట్టినా అభిశంసన తీర్మానం వీగిపోయింది. అధికార పీపుల్ పవర్' పార్టీకి చెందిన సభ్యులు ఓటింగ్‌ను బహిష్కరించటం వల్ల అంభిశంసన తీర్మానం వీగిపోయినట్లు స్పీకర్ ప్రకటించారు.
ఓటింగ్‌కు అధికార పార్టీ దూరంగా
'ఎమర్జెన్సీ మార్షల్ లా' ప్రకటనతో చిక్కుల్లో పడిన ఆయనపై విపక్షాలు పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఇది ఆమోదం పొందాలంటే మూడింట రెండువంతుల మెజారిటీ ఉండాలి. అంటే నేషనల్ అసెంబ్లీలో ఉన్న మొత్తం 300 మంది సభ్యుల్లో 200 మంది మద్దతు అవసరం. ప్రతిపక్ష పార్టీలకు 192 సీట్లు ఉండగా, అధికార పార్టీకి చెందిన ముగ్గురు చట్టసభ్యులు మాత్రమే ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఓట్ల సంఖ్య 200కి చేరుకోనందున బ్యాలెట్ లెక్కింపు లేకుండానే తీర్మానం రద్దయ్యింది. 'ఎమర్జెన్సీ మార్షల్ లా' ప్రకటన విషయంలో యూన్‌పై సొంత పార్టీ నుంచే విమర్శలు వచ్చినప్పటికీ, అధ్యక్ష పదవి ప్రతిపక్షాల చేతుల్లోకి వెళ్లిపోతుందన్న కారణంతో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో అధ్యక్షుడు ఆయన అభిశంసన నుంచి బయటపడ్డారు.
ఏం జరిగిందంటే
ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ యూన్ సుక్ యోల్ ఇటీవల 'ఎమర్జెన్సీ మార్షల్ లా' విధించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడం వల్ల పార్లమెంట్‌లో ఓటింగ్ పెట్టి అత్యవసర స్థితికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించారు. గంటల వ్యవధిలోనే ఎమర్జెన్సీని ఎత్తివేశారు. ఈ పరిణామాలతో దేశవ్యాప్తంగా ఆయనకు వ్యతిరేకత ఎదురైంది. చాలా మంది అధ్యక్షుడి అభిశంసనకు మద్దతు ఇస్తున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. యూన్‌ను తొలగించాలని పిలుపునిస్తూ ప్రజలు చేపట్టిన నిరసనలను తాజా పరిణామం మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉన్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా శనివారం ప్రజలను యూన్ సుక్ యోల్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. మార్షల్ లా విధించి ప్రజల్లో భయాందోళనలు సృష్టించినందుకు తనను క్షమించాలంటూ కోరారు. ఇటువంటి తప్పు మరోసారి చేయనని వెల్లడించారు.