Russian Military Plane Crash Today : రష్యాలో ఓ మిలిటరీ రవాణా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలింది. ఈ ఘటనలో విమానంలోని 15 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఇల్-76 మిలిటరీ కార్గో విమానం మంగళవారం పశ్చిమ రష్యాలోని ఎయిర్ బేస్ నుంచి 15 మందితో టేకాఫ్ అయ్యిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాసేపటికే విమానంలోని ఓ ఇంజిన్‌లో మంటలు చెలరేగడం వల్ల ఇవానోవో ప్రాంతంలో కూలినట్టు తెలిపింది.
ప్రమాద సమయంలో అందులో 8 మంది సిబ్బంది, ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్టు పేర్కొంది.విమానంలో ఉన్న వారి పరిస్థితి గురించి అధికారులు చెప్పనప్పటికీ, వారెవరూ సురక్షితంగా లేరని రష్యా ఆన్‌లైన్ మీడియా పేర్కొంది. ఘటన జరిగిన సమయంలో విమానంలో మంటలు చెలరేగి ఓ వైపు ఒరిగి కిందకు పడిపోతున్నట్టు కనిపించింది. ప్రమాద సమయంలో పెద్ద ఎత్తున పొగలు చెలరేగాయి.
గాల్లో ఊడిన విమానం టైరు
ఇటీవలే అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి జపాన్‌కు బయలుదేరిన యునైటైడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777 విమానానికి పెను ప్రమాదం తప్పింది. శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే విమానంలో ఎడమ వైపున ల్యాండింగ్ గేర్ వద్ద ఉన్న టైరు ఊడిపోయింది. దీంతో పైలెట్లు లాస్‌ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఫ్లైట్‌ను దారి మళ్లించారు. ల్యాండింగ్ సమయంలో విమానంలో మంటలు చెలరేగితే అదుపు చేయడానికి లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో అగ్నిమాపక యంత్రాలను సిద్ధంగా ఉంచారు.
పైలెట్లు విమానాన్ని చాకచక్యంగా రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ చేయడం వల్ల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో 235 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. అయితే విమానం టైరు శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలోని పార్కింగ్ కేంద్రంలో ఉన్న ఓ కారుపై పడటం వల్ల అది ధ్వంసమయ్యిందని చెప్పారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొన్నారు.
విమానంలోని టైర్లకు నష్టం జరిగినా లేదా ఊడిపోయిన సురక్షితంగా ల్యాండ్ అయ్యేటట్లు దాన్ని నిర్మించారని విమానయాన సంస్థ యునైటైడ్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి చేర్చుతామని పేర్కొంది. బోయింగ్ 777 విమానాలకు కుడి, ఎడమ భాగాల్లోని మెయిన్ ల్యాండింగ్ గేర్ల వద్ద పన్నెండు టైర్లు ఉంటాయి. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ విభాగం దర్యాప్తు చేపట్టిందని అధికారులు తెలిపారు.