Russia Nuclear Warning : ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న వేళ నాటో దేశాలకు రష్యా గట్టి హెచ్చరిక చేసింది. తన అణు ముసాయిదాకు సవరణలు చేసింది. తాజా మార్పుల ప్రకారం రష్యాపై మరో దేశం దాడికి అణ్వాయుధాలు కలిగిన దేశం మద్దతు ఇచ్చినప్పుడు దురాక్రమణలో దాన్ని కూడా భాగస్వామిగా పరిగణించనున్నట్లు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. బుధవారం జరిగిన రష్యా భద్రతా మండలి సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
తమ దేశంపై అణు సామర్థ్యం లేని రాజ్యం, అణు సామర్థ్యం కలిగిన దేశం మద్దతుతో దాడి చేసినప్పుడు రష్యా ఫెడరేషన్‌పై సంయుక్త దాడిగా పరిగణిస్తామని పుతిన్ తెలిపారు. అయితే అలాంటి దాడులకు ప్రతిస్పందనగా అణ్వాయుధాలు ప్రయోగిస్తారా అనే విషయాన్ని పుతిన్ వెల్లడించలేదు. పుతిన్ హెచరిక తర్వాత రష్యా తన అణు ముసాయిదాలో సవరణలు చేసింది. తాజా సవరణలు ప్రకారం ప్రత్యర్థులు విమానాల ద్వారా భారీ దాడులు చేయడం, క్రూజ్ క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించినప్పుడు అణ్వస్త్రాలను వినియోగించేందుకు రష్యా నిర్ణయం తీసుకుంటుంది. ఇక పశ్చిమ దేశాలు తాము సరఫరా చేసిన దీర్ఘశ్రేణి ఆయుధాలతో రష్యా భూభాగంపై ఉక్రెయిన్ దాడి చేసేందుకు అనుమతిస్తే కీవ్‌తో జరుగుతున్న యుద్ధంలో నాటో కూడా చేరినట్లవుతుందని పుతిన్ పేర్కొన్నారు.