Russia Military Plane Crash : ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా విమానం నేలకూలింది. అందులో ప్రయాణిస్తున్న 74 మంది మృతి చెందినట్లు రష్యా అధికారులు తెలిపారు. సైనిక రవాణా విమానం ఇలియుషిన్-76 లో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు, ఆరుగురు సిబ్బంది, మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని రష్యా వెల్లడించింది. ఉక్రెయిన్ సమీపంలోని బెల్గోరోడ్‌లో ఈ దుర్ఘటన జరిగిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనికి గల కారణాలను గుర్తించేందుకు స్పెషల్ మిలిటరీ కమిషన్ ఘటనా స్థలానికి వెళ్తోందని తెలిపింది.
ఖైదీల మార్పిడిలో భాగంగా ఉక్రెయిన్ ఖైదీలను బెల్గోరాడ్ ప్రాంతానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని రష్యా అధికారులు తెలిపారు. ఆ విమానంలో యుద్ధ ఖైదీలను తరలించట్లేదని S-300 రక్షణ వ్యవస్థకు చెందిన క్షిపణులు తరలిస్తున్నారని ఉక్రెయిన్ ఆరోపణ చేసింది. ఉక్రెయిన్ దళాలే ఈ విమానాన్ని నేలకూల్చినట్లు రష్యా పార్లమెంట్ స్పీకర్ ఆరోపించారు.
కాగా, విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదానికి ముందు విమానం అదుపుతప్పి వేగంగా కిందికి పడిపోతున్నట్లు కనిపిస్తోంది. తర్వాత ఇది నివాస ప్రాంతాల వద్ద నేలను తాకింది. దాంతో ఒక్కసారిగా విమానంలో మంటలు చెలరేగాయి.
సైనిక రవాణా విమానం ఇలియుషిన్-76 (IL-76)లో బలగాలు, సరకులు, సైనిక సాధనాలను తరలించే వీలుంది. ఈతరహా విమానాలు భారత వైమానిక దళంలో కూడా సేవలు అందిస్తున్నాయి.