Papua New Guinea Violence : పపువా న్యూ గినియాలో చెలరేగిన గిరిజన హింసాకాండలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా మీడియా వెల్లడించింది. ఎంగా ప్రావిన్స్‌లోని వాపెనమండ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఈ హింస చెలరేగినట్లు తెలిపింది. అంబులిన్, సికిన్ తెగల ప్రజలు పరస్పరం కాల్పులు జరుపుకున్నారని చెప్పింది. సోమవారం ఉదయం నాటికి వాపెనమండలోని రోడ్డు పక్కన, కొండలపై తొలుత 64 మృతదేహాలు కనిపించాయని తెలిపిన ఆస్ట్రేలియా మీడియా- ఆ తర్వాత 26 మంచి చనిపోయారని ప్రకటించింది.
భద్రతా బలగాలకు ఆదేశాలు
ఈ హింసాకాండలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించామని పపువా న్యూ గినియా అధికారులు ఆస్ట్రేలియా మీడియాకు తెలిపారు. ట్రక్కుల్లో మృతదేహాలను తరలించినట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. గిరిజనుల పోరు ఉద్ధృతమవుతోందన్న హెచ్చరికలు ఉన్నాయని ఎంగా గవర్నర్ పీటర్ ఇపాటాస్ తెలిపారు. తగిన చర్యలు తీసుకోవాలని భద్రతా బలగాలకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు.
అతిపెద్ద ఘోరం ఇదే!
పపువా న్యూ గినియాలో తాను చూసిన అతిపెద్ద ఘోరం ఇదేనని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇదే తెగల మధ్య కొన్నేళ్ల క్రితం జరిగిన ఘర్షణలో 60 మంది చనిపోయినట్లు చెప్పారు. ఘటన జరిగిన ప్రాంతానికి అదనపు భద్రతా దళాలను పంపాలని ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు కోరాయి. వెంటనే ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశాయి.
ప్రధాని తీవ్రఆందోళన
పపువా న్యూ గినియాలో హింసాకాండపై ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోని ఆల్బనీస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తనను ఆ వార్త కలిచివేసిందని చెప్పారు. పపువా న్యూ గినియాకు సహాయం చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఆ దేశంలోని పోలీసు అధికారులకు శిక్షణ ఇవ్వడంలో తాము ఎప్పటి నుంచో సహాయం చేస్తున్నామని చెప్పారు.
కాల్పులు జరిపి పరార్!
ఇటీవలే అమెరికాలో ఓ దుండగుడు వేర్వేరు ఇళ్లపై కాల్పులు జరిపి 8 మందిని పొట్టనబెట్టుకున్నాడు. రెండు రోజుల పాటు కాల్పులు జరిపిన అతడు- పక్క రాష్ట్రానికి పారిపోయాడు. ఈ క్రమంలో పోలీసులు అతడిని అడ్డగించగా- నిందితుడు తనను తాను కాల్చుకొని చనిపోయాడు. నిందితుడిని రోమియో నాన్స్‌గా పోలీసులు గుర్తించారు. మృతులతో అతడికి ఇదివరకే పరిచయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్- మణిపుర్లో మళ్లీ హింస- ఇంటర్నెట్ బంద్