Pakistan Militants Killed People : పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. 11 మందిని దారుణంగా చంపేశారు. ముష్కరులు శుక్రవారం నోష్కి జిల్లాలోని హైవేపై వెళ్తున్న బస్సును ఆపి అందులో ఉన్న ప్రయాణికులను తుపాకీతో బెదిరించి తొమ్మిది మందిని కిడ్నాప్ చేశారని పోలీసులు తెలిపారు. అనంతరం వారిని హతమార్చినట్లు చెప్పారు. మరో సంఘటనలో అదే రహదారిపై వెళ్తున్న కారుపై ముష్కరులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.
'వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు'
నోష్కీ హైవేపై 11 మందిని హతమార్చిన ఉగ్రవాదులను క్షమించబోమని, త్వరలోనే వారిని పట్టుకుంటామని బలూచిస్థాన్ ముఖ్యమంత్రి మీర్ సర్ఫరాజ్ బుగ్తీ అన్నారు. దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను వెంబడిస్తామని, బలూచిస్థాన్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే వారి లక్ష్యమని పేర్కొన్నారు. మరోవైపు అమాయక ప్రజలపై దాడిని ఖండించారు బలూచిస్థాన్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. ఇలాంటి ఘటనలకు బలూచిస్థాన్‌లో అస్కారం లేదని నొక్కి చెప్పారు. కాగా, అమాయక ప్రజలపై దాడులకు సంబంధించి ఇప్పటివరకూ ఏ ఉగ్రసంస్థ కూడా బాధ్యత వహించలేదు.
ఆత్మాహుతి దాడిలో ఆరుగురు మృతి!
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడిలో ఐదుగురు చైనా దేశస్థులు సహా ఆరుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఇస్లామాబాద్ నుంచి కోహిస్థాన్ వెళ్తున్న పేలుడు పదార్థాలతో నిండిన వాహనం, షాంగ్లా జిల్లాలోని బిషామ్ ప్రాంతంలో ఓ బస్సును ఢీకొట్టడం వల్ల ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో బస్సులో ఉన్న చైనీయులతో పాటు డ్రైవర్ ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు ఈ దాడికీ ఇప్పటివరకు ఏ ఉగ్ర సంస్థ బాధ్యత వహించలేదు. అయితే ఇది ఆత్మాహుతి దాడిగా పోలీసులు చెప్పినట్లు పాకిస్థాన్ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఈ పేలుడుపై సమాచారం అందుకున్న అధికారులు, ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం కోసం మార్చురీకి పంపించారు. ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఈ పేలుడులో మరణించిన చైనీయులు డాసు జలవిద్యుత్ ప్రాజెక్టులో పని చేస్తున్నారు. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా చేపడుతున్న అనేక ప్రాజెక్టుల్లో వేలాది మంది చైనా సిబ్బంది పాకిస్థాన్‌లో పని చేస్తున్నారు.
రంజాన్ వేళ పాకిస్థాన్‌లో మరో విషాదం- పడవ బోల్తా పడి 15మంది గల్లంతు! - Pakistani Boat Accident
ఆయన ఇల్లు 4 వేల కోట్లు! - ఆస్తి మొత్తం ఎంత ఉండొచ్చు? - ఇంతకీ ఎవరతను? - Worlds Richest Family