Pakistan Air Strike On Afghanistan : పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌ల మధ్య ఘర్షణ వాతావరణం మరింత ముదురుతోంది. సోమవారం అఫ్గానిస్థాన్ భూభాగంపై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడుల్లో 8మంది మరణించారు. ఈ దాడులకు ప్రతిస్పందనగా తాలిబన్ దళాలు విరుచుకుపడ్డాయి. భారీ ఆయుధాలతో సరిహద్దుల వద్ద ఉన్న పాకిస్థాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు తాలిబన్ రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా పాకిస్థాన్‌లో అఫ్గాన్ ఉగ్రవాదుల దాడులు జరగకూడదని, పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవాలని తాలిబన్లకు అమెరికా పిలుపునిచ్చింది.
అసలేం జరిగిదంటే
మార్చి 16న పాకిస్థాన్ మీర్ అలీలోని సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి అయిదుగురు సైనికులు, ఇద్దరు అధికారులను హతమార్చారు. దానికి ప్రతిగా సోమవారం అఫ్గాన్ భూభాగంపై పాకిస్థాన్ వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో ఎనిమిది మంది పౌరులు మరణించారు. వారిలో స్త్రీలు, పిల్లలు ఉన్నారని అఫ్గాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ సోమవారం తెలిపారు. కాగా, ఆదివారం రాత్రి ఉత్తర వజీరిస్థాన్‌లోని ఒక గిరిజన ప్రాంతంపై తమ సైనికులు దాడిచేసి ఎనిమిదిమంది ఉగ్రవాదులను హతమార్చామని పాకిస్థాన్ సైన్యం ప్రకటిచింది. మార్చి 16న అలీ స్థావరంపై దాడికి పాల్పడింది ఈ ఉగ్రవాదులేనని వెల్లడించింది. మీర్ అలీ దాడికి బాధ్యులైనవారిని వదిలేది లేదని పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ప్రకటించిన మరునాడే పాక్ సైనిక చర్య జరిగింది.
సరిహద్దుల్లో తాలిబన్ల దళాలు
అయితే అలీ స్థావరంపై దాడి తమ పనేనని హఫీజ్ గుల్ బహాదుర్ గ్రూపు ప్రకటించింది. అఫ్గానిస్థాన్ నుంచి మరో ఉగ్ర గ్రూపు తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) కూడా పాక్‌పై దాడులు నిర్వహిస్తోంది. దీనికి తమను నిందించరాదని, పాక్ తన సమస్యలను తానే చక్కదిద్దుకోవాలని అఫ్గాన్ ప్రతినిధి జబీహుల్లా సూచించారు. అలాకాకుండా అఫ్గాన్ భూభాగంపై దాడులకు దిగితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు పాకిస్థాన్ చేసిన దాడులకు ప్రతిగా తాలిబన్ల దళాలను భారీ ఆయుధాలతో సరిహద్దుల్లో పాక్ సైనిక స్థావరాలే లక్ష్యంగా మోహరించిన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
రష్యా అధ్యక్షుడిగా ఐదోసారి పుతిన్ విజయం- అడుగు దూరంలో మూడో ప్రపంచ యుద్ధం అంటూ హెచ్చరిక!
ఇండియన్ నేవీ ఇంటెన్స్ ఆపరేషన్- రంగంలోకి INS కోల్‌కతా- పైరేట్స్‌కు చుక్కలు చూపించిన కమాండోలు