Pakistan Accident Today : పాకిస్థాన్‌లో బస్సు లోయలో పడి ముగ్గురు మహిళలు సహా 20 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉంది.
దాదాపు 30 మంది ప్రయాణికులతో ఓ బస్సు రావల్పిండి నుంచి గిల్గిట్ పాల్టిస్థాన్ వైపు వెళ్తుండగా డయామర్ జిల్లాలోని కారకోరం హైవేపై వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని అధికారులు తెలిపారు. అనంతరం బస్సు అదుపుతప్పి లోయలో పడిందని చెప్పారు. ఘటనాస్థలిలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. 15 మంది క్షతగాత్రులను చిలాస్‌లోని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.
ఈ ఘటనపై గిల్టిట్ బాల్టిస్థాన్ ముఖ్యమంత్రి హాజీ గుల్బర్ ఖాన్ స్పందించారు. మృతుల పట్ల సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ దుర్ఘటన తర్వాత చిలాస్ ఆస్పత్రిలో అత్యవరస పరిస్థితిని ప్రకటించామని గిల్టిట్ బాల్టిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫైజుల్లా ఫరక్ తెలిపారు.
అతివేగంతో లోయలో పడ్డ బస్సు
పాకిస్థాన్‌లో ఫిబ్రవరిలో ఇలాంటి ఘటనే జరిగింది. ఆ దుర్ఘటనలో 10మంది మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. అతివేగంతో ప్రయాణిస్తున్న బస్సు ఖైబర్ పఖ్తుంఖ్వాలో లోయలో పడిపోయింది. అతివేగం కారణంగానే మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని పోలీసులు తెలిపారు. మృతుల్లో మహిళలు, పిల్లలు ఉన్నట్లు చెప్పారు. హరిహరపుర్ జిల్లాలోని కొండప్రాంతమైన ఖాన్పుర్ గ్రామం నుంచి బస్సు వస్తుండగా తర్నవాకు సమీపంలో ప్రమాదానికి గురైనట్లుగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ప్రయాణికులను స్థానికుల సహాయంతో హరిపుర్ జిల్లాలోని ట్రామా సెంటర్‌కు తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.
ఫ్లైఓవర్ పిల్లర్‌ను ఢీకొని లోయలో పడ్డ బస్సు
కొన్నాళ్ల క్రితం పాకిస్థాన్‌లో జరిగిన ఘోర రహదారి ప్రమాదంలో 42 మంది మరణించారు. బలూచిస్థాన్‌లోని లాస్బెలా ప్రాంతంలో వేగంగా వెళ్తున్న ఓ బస్సు ఫ్లైఓవర్ పిల్లర్‌ను ఢీకొని అదుపు తప్పి లోయలో పడింది. దీంతో వాహనంలో మంటలు చెలరేగాయి. బస్సులోని 48 మంది ప్రయాణికుల్లో 42 మంది ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలో ఓ మహిళ, చిన్నారితో సహా ముగ్గురిని ప్రాణాలతో కాపాడామని లాస్బెలా అసిస్టెంట్ కమిషనర్ అంజా అంజుమ్ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
పాక్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు, కారు.. 30 మంది మృతి
పాక్‌లో ఘోర ప్రమాదం.. గుంతలో బోల్తాపడ్డ వ్యాన్.. 20 మంది భక్తులు దుర్మరణం