Navalny Death News : రష్యాలో అవినీతి వ్యతిరేక ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, రష్యా ఆఫ్ ది ఫ్యూచర్ పార్టీ నేత అలెక్సీ నావల్నీ కారాగారంలో మరణించారు. శుక్రవారం నడక తర్వాత నావల్నీ అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు రష్యాలోని ఫెడరల్ ప్రిజన్ సర్వీస్ వెల్లడించింది. చికిత్స కోసం అంబులెన్స్ వచ్చినా అప్పటికే నావల్నీ మరణించినట్లు తెలిపింది. ఆయన మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఆ ప్రకటనలో పేర్కొంది. రష్యాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో నావల్నీ మరణం చర్చనీయాంశంగా మారింది.
పుతిన్‌పై పోటీ చేసి గుర్తింపు
రష్యాలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన నేతగా నావల్నీకి పేరుంది. ముఖ్యంగా రష్యా ప్రభుత్వం, పుతిన్‌కు వ్యతిరేకంగా చేసిన ఆందోళనల వల్ల ప్రపంచ వ్యాప్తంగా నావల్నీ గుర్తింపు పొందారు. రష్యాలో ప్రభుత్వ ఉన్నతాధికారుల అవినీతిని బయటపెట్టిన నావల్నీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌పై పోటీ చేయడం వల్ల దేశవ్యాప్తంగా ఆయనకు ఆదరణ లభించింది. గతంలో పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చారు.
ఈ క్రమంలో 2020లో నావల్నీపై విష ప్రయోగం జరిగింది. దాదాపు ఐదు నెలలపాటు జర్మనీలో చికిత్స పొందారు. పుతిన్‌పై పోరాటం ఆపేది లేదంటూ 2021 జనవరిలో తిరిగి రష్యాకు చేరుకున్న నావల్నీని విమానాశ్రయంలోనే పోలీసులు అరెస్టు చేశారు. ఆర్థిక అవకతవకలు, తీవ్రవాద కార్యకలాపాలపై నమోదైన కేసులో స్థానిక కోర్టు నావల్నీకి 19 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఇది ఆయనకు మూడో కారాగార శిక్ష.
జీవితకథ ఆధారంగా డాక్యుమెంటరీ
రాజకీయ కక్షసాధింపు చర్యల వల్లే నావల్నీని రష్యా జైలులో పెట్టినట్లు పశ్చిమ దేశాలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. ఆయన జీవితంలో జరిగిన పరిణామాలతో నావల్నీ అనే డాక్యుమెంటరీ తెరకెక్కింది. దీనికి ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో ఆస్కార్ దక్కింది. గత ఏడాదే జైలు నుంచి నావల్నీ అదృశ్యమయ్యారని తాము ఆయన్ని సంప్రదించలేకపోతున్నామని నావల్నీ న్యాయవాదులు ఆరోపించారు. 2023 డిసెంబర్‌లో నావల్నీని వ్లాదిమిర్ ప్రాంతంలో ఉన్న జైలు నుంచి అత్యంత భద్రతా కలిగిన పీనల్ కాలనీ జైలుకు మార్చారు.