Maldives Indian Troops : భారత్ వ్యతిరేక వైఖరి ఆవలంభిస్తున్న తనపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నా మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మార్చి 10 నాటికి తమ దేశంలో ఉన్న భారత సైనికుల మెుదటి బృందాన్ని వెనక్కి పంపనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాదిలో మాల్దీవుల పార్లమెంట్‌లో తొలి ప్రసంగం చేశారు ముయిజ్జు.
మా విషయంలో వేర దేశ జోక్యం వద్దు!
తమ దేశంలో ఉన్న మూడు వైమానిక స్థావరాల్లో ఒకదానిలో విధులు నిర్వర్తిస్తున్న భారత్ బలగాలు మార్చి 10వ తేదీలోగా వెళ్లిపోతాయని చెప్పారు. మిగతా రెండు స్థావరాల్లో ఉన్న భారత్ దళాలు మే 10వ తేదీ నాటికి వైదొలుగుతాయని వెల్లడించారు. ఈ విషయంలో భారత్‌తో ఉన్న ఒప్పందాన్ని తాము పునరుద్ధరించుకోవడం లేదని మయిజ్జు స్పష్టం చేశారు. తమ సార్వభౌమత్వం విషయంలో మరొక దేశం జోక్యాన్ని తాము అనుమతించబోమని తెలిపారు.
అంగీకారానికి రెండు దేశాలు!
Maldives Asks India Troops To Leave : ఈ బలగాల ఉపసంహరణపై రెండు దేశాలు ఒక అంగీకారానికి వచ్చినట్లు ఇప్పటికే అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. మాల్దీవుల్లో మోహరించిన భారత బలగాలు భారత్ సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలను చూస్తుంటాయి.
బహిష్కరించిన రెండు పార్టీలు
మరోవైపు, భారత వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుకు నిరసనల సెగ తగిలింది. పార్లమెంటు తొలివిడత సమావేశాల్లో ముయిజ్జు ప్రసంగాన్ని రెండు ప్రధాన విపక్షాలు బహిష్కరించాయి. మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీతో పాటు ద డెమోక్రాట్స్ పార్టీలు అధ్యక్షుడు ప్రసంగాన్ని బహిష్కరించినట్లు సమాచారం. 56 మంది ఎంపీలు అధ్యక్షుడి ప్రసంగాన్ని బహిష్కరించగా అందులో 13 మంది ద డెమోక్రాట్స్, 44 మంది MDPకి చెందిన పార్లమెంటు సభ్యులు ఉన్నారు.
ముయిజ్జు ప్రసంగం సమయంలో కేవలం 24 మంది ఎంపీలే పార్లమెంటుకు హాజరయ్యారు. భారత్‌తో పాటు ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులను తిరిగి నియమించడానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డెమోక్రాట్స్ ప్రకటించారు. భారత వ్యతిరేక వైఖరిని ఉద్దేశించి ద్వీపదేశ విదేశాంగ విధానంలో మార్పు రావడాన్ని అత్యంత హానికరంగా అభివర్ణిస్తూ రెండు పార్టీలు ప్రకటనను విడుదల చేశాయి. అభివృద్ధి భాగస్వామి, చిరకాల మిత్రదేశమైన భారత్‌ను దూరం చేయడం, మాల్దీవుల దీర్ఘకాలిక అభివృద్ధికి చాలా హానికరమని పేర్కొన్నాయి.