Hezbollah Top Commander Killed : వైమానిక, భూతల దాడులతో హెజ్‌బొల్లాను ఉక్కిబిక్కిరి చేస్తోన్న ఇజ్రాయెల్ మరోసారి ఆ సంస్థను కోలుకోలేని దెబ్బకొట్టింది. హెజ్‌బొల్లా టాప్ కమాండర్ జాఫర్ ఖాదర్ ఫార్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం(ఐడీఎఫ్) పేర్కొంది. ఇజ్రాయెల్‌పై జరిగిన పలు రాకెట్ దాడుల వెనక ఆ కమాండ్ హస్తం ఉన్నట్లు తెలిపింది. అయితే, జాఫర్ మృతి గురించి హెజ్‌బొల్లా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఆ దాడులన వెనక జాఫరే
నాసర్ బ్రిగేడ్ రాకెట్, మిస్సైల్స్ యూనిట్‌కు చెందిన కమాండర్ జాఫర్ ఖాదర్ ఫార్‌ను దక్షిణ లెబనాన్‌లో హతమార్చినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. 'ఇజ్రాయెల్‌పై జరిగిన పలు దాడుల వెనక జాఫర్ ఉన్నాడు. మాజ్‌దల్ షామ్స్‌పై రాకెట్ దాడి ఘటనలో 12 మంది చిన్నారుల మృతి చెందడం, గతవారం మెటులా ఘటనలో ఐదుగురు ఇజ్రాయెలీలు చనిపోయిన ఘటన వెనకుంది జాఫరే. అంతేకాకుండా గతేడాది అక్టోబర్ 8న తూర్పు లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులను హెజ్‌బొల్లా అతడి ఆధ్వర్యంలోనే చేపట్టింది' అని ఐడీఎఫ్ తెలిపింది.
🔴 The Commander of the Hezbollah Nasser Unit’s Missiles and Rockets Array, Jaafar Khader Faour, was eliminated in the area of Jouaiyya in southern Lebanon.
— Israel Defense Forces (@IDF) November 2, 2024
Faour was responsible for multiple rocket attacks toward the Golan, including an attack that resulted in the deaths of… pic.twitter.com/rfXtG6qlBw
బంధీగా సీనియర్ హెజ్‌బొల్లా ఆపరేటివ్
ఈ ఘటనకు ముందు ఉత్తర లెబనాన్‌లో సీనియర్ హెజ్‌బొల్లా ఆపరేటివ్‌ను బంధించినట్లు ఇజ్రాయెల్ నేవీ బృందం పేర్కొంది. కానీ, ఆ వ్యక్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఇక బంధీ చేసిన వ్యక్తిని ఇజ్రాయెల్‌కు తరలించి విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు లెబనాన్‌కు చెందిన నేవీ కెప్టెన్‌ను కొందరు అపహరించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన వెనక ఇజ్రాయెల్ పాత్ర ఉందా అనే కోణంలో విచారణ చేపట్టినట్లు లెబనీస్ అధికారులు తెలిపారు. అపహరణకు గురైన నేవీ కెప్టెన్‌కు హెజ్‌బొల్లాతో సంబంధాలు ఉండవచ్చని లెబనాన్ మిలిటరీ అధికారి ఒకరు తెలిపారు. తమ సభ్యుడు ఒకరిని ఇజ్రాయెల్ బలగాలు బంధీ చేశాయని హెజ్‌బొల్లా సైతం ధ్రువీకరించింది.
ఇక లెబనాన్‌లోని బెకా వ్యాలీపై ఇజ్రాయెల్ నిర్వహించిన దాడుల్లో 52 మంది మృతి చెందగా, 72 మంది గాయపడ్డారు. గాజాలోనూ 24 గంటల్లో 42 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.