Iran Fired Missiles At Israel : పశ్చిమాసియాలో పరిస్థితులు మరింతగా దిగజారుతున్నాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ నేరుగా క్షిపణి దాడులు చేపట్టింది. దీనితో పశ్చిమాసియా నిప్పుల కుంపటైంది. ప్రాంతీయ యుద్ధం అంచున నిలిచింది. హెజ్‌బొల్లా, హమాస్ అగ్రనేతలను అంతమొందించిన ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ ఎత్తున క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ నగరాలైన టెల్‌అవీవ్, జెరూసలెంపై మంగళవారం రాత్రి ఏకంగా 180 క్షిపణుల్ని ప్రయోగించింది. వీటిలో చాలా వాటిని అమెరికా సాయంతో ఇజ్రాయెల్ అడ్డుకోగలిగింది. కానీ కొన్ని క్షిపణులు నేరుగా నగరాలను తాకాయి. ప్రాణనష్టం వివరాలు తెలియనప్పటికీ, తమవైపు కొద్దిమంది మాత్రమే గాయపడ్డారని ఇజ్రాయెల్ ప్రకటించింది. హెజ్‌బొల్లాపై ప్రతీకారం తీర్చుకునేందుకు లెబనాన్‌లో భూతల దాడులు ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్ క్షిపణులు ప్రయోగించడం గమనార్హం. ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు 12 నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించాయి. ఈ దాడుల గురించి తమ అంతర్జాతీయ భాగస్వాములకు ఇరాన్ సమాచారం ఇచ్చింది. పదుల సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణుల్ని వాడినట్లు అధికారికంగానూ ప్రకటించింది.
అలాచేస్తే మరింత విరుచుకుపడతాం: ఇరాన్
ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగితే తమ ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని ఇరాన్ గట్టిగా హెచ్చరించింది. ఇరాన్ దాడులతో బెంబేలెత్తిన ఇజ్రాయెలీలు బాంబు షెల్టర్లలోకి వెళ్లి తలదాచుకున్నారు. మరికొందరు రోడ్డు పక్కనే ఉన్న రక్షణ ప్రదేశాల్లో దాక్కున్నారు. దేశమంతటా సైరన్ల మోత మోగింది. టీవీ ఛానళ్లు, మొబైల్ ఫోన్ల ద్వారా ప్రభుత్వం ప్రజల్ని అప్రమత్తం చేసింది. ఇరాన్ క్షిపణుల్ని కూల్చేయాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తమ దళాలకు ఆదేశాలు జారీచేశారు.
ప్రతీకారం తప్పదు!
ఇరాన్ దాడులకు ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరించింది. దీంతో ఈ పోరు మరింత విస్తరించి ప్రాంతీయ యుద్ధంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌లోని జఫ్ఫాలో ఇద్దరు సాయుధులు విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు ఇజ్రాయెలీలు చనిపోగా పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు.
సరిహద్దు గ్రామాలపై దాడి
‘పరిమిత, స్థానిక’ ఆపరేషన్ అంటూ హెజ్‌బొల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ గురిపెట్టింది. ముఖ్యంగా తమ సరిహద్దుకు చేరువగా ఉన్న గ్రామాలపై విరుచుకుపడింది. ఉత్తర ఇజ్రాయెల్‌లో స్థానికులకు తక్షణ ముప్పు పొంచి ఉన్న కారణంగా ఈ దాడులు చేయకతప్పడం లేదని సమర్థించుకుంది. హెజ్‌బొల్లా మాత్రం దాడుల వార్తల్ని పూర్తిగా తోసిపుచ్చింది. ఆ గ్రూప్ ప్రతినిధి మహమ్మద్ ఆఫిఫి మాట్లాడుతూ, ఇజ్రాయెల్ బలగాలు లెబనాన్‌లోకి ప్రవేశించాయనేది అవాస్తవమని అన్నారు. శత్రువులతో నేరుగా పోరాడేందుకు తమ ఫైటర్స్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇజ్రాయెల్ వైపు మధ్యశ్రేణి క్షిపణులు ప్రయోగించామని, అది కేవలం ప్రారంభం మాత్రమే అని హెచ్చరించారు. ఇజ్రాయెల్ సైన్యంలో అత్యంత శక్తిమంతమైన దళాల్లో ఒకటైన ‘డివిజన్ 98’ పారా ట్రూపర్ కమాండోలు సోమవారం రాత్రి దక్షిణ లెబనాన్‌లోకి అడుగుపెట్టారు. పాలస్తీనా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ గగనతల దాడి జరపడం వల్ల ఆరుగురు చనిపోయారని తెలుస్తోంది. దక్షిణ లెబనాన్‌లో కొన్ని ప్రాంతాల్లోకి ప్రజలు వెళ్లవద్దని ఇజ్రాయెల్ సూచించింది. అవలి నదికి ఉత్తరాన ఉన్నవారంతా ఖాళీ చేసేయాలని కూడా హెచ్చరించింది. హెజ్‌బొల్లా నుంచి దాడులు మరింత ముమ్మరమయ్యే అవకాశం ఉండడంతో ప్రజల కదలికలపై ఇజ్రాయెల్ సైన్యం ఆంక్షలు విధించింది.
ఇరాన్ చాలా పెద్ద తప్పు చేసింది : నెతన్యాహు
ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడటంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. ఇరాన్ భారీ తప్పిదానికి పాల్పడిందని, దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుందన్నారు. జెరూసలెంలో అధికారులతో భద్రతా కేబినెట్ సమావేశంలో పాల్గొన్న నెతన్యాహు ఇరాన్ చర్యలపై మండిపడ్డారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి విఫలమైనట్లు పేర్కొన్నారు. తమకు ఉన్న ప్రపంచంలోనే అత్యంత అధునాతన డిఫెన్స్ వ్యవస్థతోనే ఇది సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా తమకు అండగా నిలిచిన అమెరికాకు నెతన్యాహు ధన్యవాదాలు తెలిపారు.
ఇరాన్ ఒక ప్రమాదకరమైన దేశం : హారిస్
ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల దాడికి ఇజ్రాయెల్ ప్రతిస్పందన ఎలా ఉంటుందో అనే దానిపై లోతైన చర్చలు జరుగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ఇప్పటికే నెతన్యాహుతో ఇరాన్ దాడి ఘటనపై మాట్లాడినట్లు తెలిపారు. ఇరాన్ దాడి విఫలప్రయోగమని, ఎలాంటి ప్రభావం చూపలేదన్నారు. పశ్చిమాసియాలో ఇరాన్ ఒక ప్రమాదకర దేశం, అస్థిరపరిచే శక్తి అని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ భద్రతకు వాషింగ్టన్ కట్టుబడి ఉందన్నారు.
ప్రత్యక్ష దాడికి దిగితే సహించబోం: ఆస్టిన్
ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడికి దిగితే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇరాన్‌ను హెచ్చరించారు. తనను తాను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని పునరుద్ఘాటించారు. ‘‘అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై జరిగిన తరహా దాడులకు తావులేకుండా ఉండేందుకు సరిహద్దు వెంబడి హెజ్‌బొల్లాకు చెందిన నిర్మాణాలను నిర్వీర్యం చేయాల్సిన అవసరాన్ని మేం గుర్తించాం. సరిహద్దుకు ఇరువైపులా ఉన్న ప్రజలు సురక్షితంగా తమ ఇళ్లకు తిరిగివెళ్లాలి. దానికి దౌత్యపరమైన తీర్మానం అవసరమని స్పష్టంచేశాను. ఇరాన్, దాని మద్దతున్న గ్రూపుల నుంచి అమెరికా సిబ్బంది, మిత్రులను రక్షించుకునేందుకు అమెరికా సంసిద్ధంగా ఉంది. మరోవైపు ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఏ దేశమైనా తలదూరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ ఆర్మీ హెచ్చరించింది.
యెమెన్ హూతీ తిరుగుబాటుదారులుగా భావిస్తున్నవారు ఎర్ర సముద్రంలో ఒక నౌకపై దాడి చేశారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మొదలయ్యాక వాణిజ్య నౌకపై దాడి జరగడం ఇదే తొలిసారి. ఖతార్, యూఏఈ, తుర్కియే, ఈజిప్ట్ వంటి దేశాలు లెబనాన్‌కు మద్దతు ప్రకటించాయి.