Israel Airstrike On Lebanon : హెజ్‌బొల్లా అంతమే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. హెజ్‌బొల్లాకు కంచుకోటగా భావించే రాజధాని బీరుట్ శివారు ప్రాంతాల్లో వైమానిక దాడులను తీవ్రతరం చేసింది. ఇప్పటికే నస్రల్లా సహా కీలక హెజ్‌బొల్లా నేతలను హతమార్చిన ఇజ్రాయెల్ మరింత మందిని మట్టుబెట్టినట్టు తెలిపింది. శనివారం రాత్రంతా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 25 మంది ప్రాణాలు కోల్పోయారని లెబనాన్ ఆరోగ్యశాఖ తెలిపింది. 127 మంది గాయపడినట్టు పేర్కొంది.
ఒకవైపు భీకర దాడులు చేస్తూనే డ్రోన్లతో ఇజ్రాయెల్ సేనలు ఎప్పటికప్పుడు హెజ్‌బొల్లా లక్ష్యాలపై నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. బీరుట్ శివారు ప్రాంతాలపై ఇప్పటి వరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గత రాత్రి జరిపినవే అత్యంత దారుణమైనవని లెబనాన్‌లో విధులు నిర్వహిస్తున్న పలువురు పాత్రికేయులు పేర్కొన్నారు. బాణసంచాలా మొదలైన దాడులు అంతకంతకూ పెరుగుతూ ఉదయం వరకూ భీకరంగా సాగాయని చెప్పారు.
గ్రామాలు ఖాళీ చేయాలని హెచ్చరికలు
దక్షిణ లెబనాన్‌లోని 25 గ్రామాల ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) హెచ్చరికలు జారీ చేసిన కొన్ని గంటల్లోనే భీకర దాడులు జరిగినట్టు తెలుస్తోంది. హెజ్‌బొల్లా స్థావరాలకు సమీపంలో ఉన్న వారు తమను తాము ప్రాణాపాయంలోకి పడేసుకున్నట్టేనని ఇజ్రాయెల్ పేర్కొంది. ప్రజలు తిరిగి ఎప్పుడు తమ తమ ఇళ్లకు రావొచ్చనేది చెబుతామని తెలిపింది. ఐడీఎఫ్ హెచ్చరికలతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. గత రెండు వారాల్లో జరిగిన దాడులతో చాలా చోట్ల శిథిలాలు ఉండటం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతూ సేఫ్ జోన్‌లకు వెళ్లారు.
కీలక నేతలు హతం
నస్రల్లా సహా కీలక హెజ్‌బొల్లా నేతలను ఇప్పటికే హతమార్చినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. తాజాగా హెజ్‌బొల్లా కమాండర్ ఖాదర్ అలీ తవిల్‌ను మట్టుబెట్టినట్టు పేర్కొంది. అక్టోబర్ 7 నాటి ఘటనలకు సోమవారంతో సంవత్సరం పూర్తి కానున్న నేపథ్యంలో దక్షిణ ఇజ్రాయెల్‌లో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు అక్కడి అధికారులు తెలిపారు మరోవైపు ఉత్తర లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హమాస్ లీడర్ సయిద్ అలీ సహా అతడి కుటుంబం ప్రాణాలు కోల్పోయినట్టు హమాస్ మిలిటెంట్ గ్రూప్ ప్రకటించింది.