ISIS Terror Attack In Moscow : రష్యా రాజధాని మాస్కోలోని క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్‌పై మార్చి 21న జరిగిన భీకర ఉగ్రదాడి వెనుక ఉన్నదెవరు? ఈ దాడికి తమదే బాధ్యత అని ఇస్లామిక్ స్టేట్-ఖొరాసన్ (ఐసిస్-కే) ప్రకటించినా రష్యా ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇది ఐసిస్-కే ఘాతుకమే అని అమెరికా, ఫ్రాన్స్ దేశాలు అధికారికంగా నిర్ధారణ చేస్తున్నా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎందుకు నమ్మడం లేదు? అనే అంశాలపై ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఈ ఉగ్రదాడి వెనుక ఉక్రెయినే ఉందని పుతిన్ పదేపదే చెబుతున్నారు. క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్‌పై దాడిచేసిన ఉగ్రవాదులు ఉక్రెయిన్ సరిహద్దు వైపే పరుగులు తీశారని ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే తాజాగా అమెరికా సహా పశ్చిమ దేశాలైన యూకే, ఉక్రెయిన్ నిఘా సంస్థలు, ఉక్రెయిన్ ఆర్మీ స్పెషల్ సర్వీస్ విభాగం చేతులు కలిపి మాస్కోలో ఉగ్ర దాడికి ఐసిస్‌ను పురికొల్పాయని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్బీ) అధిపతి అలెగ్జాండర్ బోర్ట్నికోవ్ ఆరోపించారు. ఈ దాడికి పాల్పడింది తజకిస్థాన్‌కు చెందిన అతివాద ఇస్లామిక్ ఉగ్రవాదులే అనే విషయాన్ని ఆయన ధ్రువీకరించారు. దాడి చేసిన ఉగ్రవాదుల మూలాలను, ప్రేరేపించిన సంస్థలను వెలికితీయడంపై తాము దృష్టి సారించామని వెల్లడించారు.
తుర్కియే నుంచి రష్యాకు వచ్చి!
మాస్కోలో ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టుల్లో ఇద్దరు (ఫరీదుని, రచబలిజోడా) ఈ ఏడాది ప్రారంభంలో తుర్కియేలో కొన్నిరోజులు గడిపినట్లు గుర్తించారు. రచబలిజోడా జనవరి 5న, ఫరీదుని ఫిబ్రవరి 20న తుర్కియేలోకి ప్రవేశించారు. వీరిద్దరూ కలిసి మార్చి 2వ తేదీన తుర్కియే నుంచి రష్యాకు బయలుదేరారు. వీరి కదలికలను తుర్కియే దేశ నిఘా విభాగాలు గుర్తించినప్పటికీ, అరెస్టు వారెంట్ లేకపోవడం వల్ల అదుపులోకి తీసుకోలేదని వెల్లడైంది. ఈ లెక్కన వేర్వేరు చోట్ల నుంచి ఉగ్రవాదులు రష్యాలోకి చేరుకొని మాస్కోలోని క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్‌పై దాడికి పథక రచన చేశారని తేలింది. ఈ వివరాలన్నీ రష్యా నిఘా సంస్థలు కూడా సేకరించాయని సమాచారం.
రష్యాపై జెలెన్స్కీ ఫైర్!
రష్యాలో ఉగ్రదాడి జరగొచ్చంటూ మార్చి 7న అమెరికా జారీ చేసిన అడ్వైజరీ అత్యంత సాధారణమైందని, అందులో కచ్చితమైన సమాచారమేదీ లేదని అలెగ్జాండర్ బోర్ట్నికోవ్ స్పష్టం చేశారు. గతంలోనూ అలాంటి అడ్వైజరీలను చాలానే అమెరికా జారీ చేసిందన్నారు. మాస్కోలో జరిగిన ఉగ్రదాడికి తమ దేశంతో ముడి పెట్టడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మండిపడ్డారు. ఇప్పటికే ఉక్రెయిన్‌లో దారుణాలకు తెగబడుతున్న రష్యా ఆర్మీ తమ భూభాగంపై దాడుల తీవ్రతను మరింత పెంచేందుకు ఈ ఉగ్రదాడి ఘటనను సాకుగా వాడుకోవాలని చూస్తోందని పేర్కొన్నారు.
ఐసిస్‌కు రష్యాపై ఎందుకింత పగ?
ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రస్తుతం పశ్చిమాసియా దేశాలు, ఆఫ్రికా దేశాలు, ఇరాక్, సిరాయా, ఆఫ్గానిస్థాన్‌లలో యాక్టివ్‌గా ఉంది. రష్యాకు సుదూరంగా ఉండే దేశాల్లో యాక్టివ్‌గా ఉన్న ఐసిస్ రష్యాపై ఎందుకు పగపట్టింది? అనే సందేహం చాలామందికి వస్తోంది. దీనికి సమాధానం సిరియాలో దొరుకుతుంది. ఎందుకంటే సిరియాలో జరిగిన అంత్యరుద్ధంలో అక్కడి బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి మద్దతుగా రష్యా ఆర్మీ పోరాటం చేసింది. సిరియాలోని ఐసిస్ ప్రధాన స్థావరాలను ధ్వంసం చేయడం, కీలక ఐసిస్ నేతలను హతమార్చడంలో రష్యా ఆర్మీ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు కూడా రష్యాకు చెందిన ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూప్ సిరియాలో యాక్టివ్‌గా ఉంది.
అమెరికా, బ్రిటన్ దేశాలకు చెందిన ఆర్మీ సిరియాలో కూడా ఉంది. ఇవన్నీ కలిసి అక్కడి ఐసిస్ స్థావరాలను ధ్వంసం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో రష్యాపై పగబట్టిన ఐసిస్ 2015 అక్టోబరులో ఈజిప్టు టూర్‌ను ముగించుకొని రష్యాకు బయలుదేరిన టూరిస్టుల విమానంపై దాడి చేసింది. ఆ ఘటనలో 224 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యా సరిహద్దుల్లో ఉండే ఒకప్పటి సోవియట్ యూనియన్ దేశాల్లోనూ ఐసిస్ నెట్‌వర్క్ ఉందని చెబుతుంటారు. ఇప్పుడు మాస్కోపై దాడిచేసిన నలుగురు ఉగ్రవాదులు తజకిస్థాన్‌కు చెందినవారు. ఆ దేశం ఒకప్పుడు సోవియట్ యూనియన్‌లోనే ఉండేది.
కరెంట్ షాక్‌తో ఇంటరాగేషన్!- నేరాన్ని ఒప్పుకున్న రష్యా ఉగ్రదాడి నిందితులు - russia attack suspects