India On Canada Allegations : ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో తమ వద్ద పక్కా ఆధారాలేవీ లేవంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలకు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. తాము ఎప్పటినుంచో ఇదే చెబుతున్నామంటూ భారత విదేశాంగ శాఖ స్పందించింది. ప్రధాని ట్రూడో తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ ఓ ప్రకటనను విడుదల చేశారు.
'నిజ్జర్ హత్య కేసు గురించి మేం ఎప్పటి నుంచో చెబుతున్న విషయమే ఇప్పుడు రుజువైంది. మన దౌత్యవేత్తలపై చేస్తున్న ఆరోపణలకు మద్దతిచ్చేలా కెనడా ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలను చూపించలేదు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇంత తీవ్రస్థాయిలో దిగజారడానికి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోనే పూర్తి బాధ్యుడు' అని జైశ్వాల్ అన్నారు.
Our response to media queries regarding PM of Canada's deposition at the Commission of Inquiry: https://t.co/JI4qE3YK39 pic.twitter.com/1W8mel5DJe
— Randhir Jaiswal (@MEAIndia) October 16, 2024
'నిఘా సమాచారం మాత్రమే ఉంది'
నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉందని ఆరోపణలు చేసినప్పుడు తనవద్ద నిఘా సమాచారమే తప్ప పక్కా ఆధారాలేవీ లేవని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో బుధవారం అంగీకరించారు. కెనడా ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్య వ్యవస్థల్లో విదేశాల జోక్యంపై విచారణ నిర్వహిస్తున్న కమిటీ ముందు ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఇదే విషయాన్ని జీ20 సదస్సు ముగింపు సమయంలో భారత ప్రధాని మోదీ దృష్టికీ తీసుకెళ్లినట్లు ట్రూడో పేర్కొన్నారు. అయితే, కెనడాలో భారత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక మంది మాట్లాడుతున్నారని, వారిని అరెస్ట్ చేయాలని ప్రధాని మోదీ తనతో చెప్పారన్నారు. కానీ, తమను విమర్శించే ధోరణి భారత్ అవలంబిస్తోందన్న విషయం జీ20 నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాతే అర్థమైందని ట్రూడో అన్నారు.
'నేరగాళ్ల ముఠాలకు కెనడియన్ల సమాచారం'
అయితే, ఈ సందర్భంగా భారత్‌పై కెనడా ప్రధాని ట్రూడో మరోసారి అభ్యంతరకర ఆరోపణలు చేశారు. భారత ప్రధాని మోదీ నేతృత్వంలోని సర్కారుతో విభేదించే కెనడా వారి వివరాలను ఇక్కడి భారత దౌత్యవేత్తలు సేకరించి, ఉన్నతస్థాయిలోని వారికి, లారెన్స్ బిష్ణోయ్ వంటి నేరగాళ్ల ముఠాలకు చేరవేస్తున్నారని ఆరోపించారు.