Hezbollah New Leader Naim Kassem : లెబనాన్‌లోని హెజ్‌బొల్లా మిలిటెంట్ గ్రూప్ కొత్త చీఫ్‌గా నెయీమ్ ఖాసిం ఎన్నికయ్యాడు. ఈ మేరకు గత నెలలో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మృతి చెందిన తమ నాయకుడు హసన్ నస్రల్లా వారసుడిగా నెయీమ్ను ఎంచుకున్నట్లు మిలిటెంట్ సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. నస్రల్లా చనిపోయినప్పటి నుంచి హెజ్బొల్లాకు నాయకుడిగా వ్యవహరించాడు నెయీమ్. దాదాపు మూడు దశాబ్దాలకుపైగా హెజ్‌బొల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా పనిచేసిన నయీమ్‌ను సెక్రటరీ జనరల్‌గా- మిలిటెంట్ సంస్థ నిర్ణయాధికార 'షురా' మండలి ఎన్నుకున్నట్లు హెజ్‌బొల్లా ప్రకటించింది. మరోవైపు, విజయం సాధించేవరకు నస్రల్లా విధానాలను కొనసాగిస్తామని హెజ్‌బొల్లా చెప్పింది.
ఎవరీ నయీం ఖాసిమ్?
హెజ్‌బొల్లాలో నయీం ఖాసిమ్‌కు మంచి వ్యూహకర్తగా పేరుంది. నస్రల్లా మరణం తర్వాత ఆయన బంధువు సఫీద్దీన్‌కు పగ్గాలు అప్పగించే అవకాశమున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ సీనియారిటీ పరంగా నెయీమ్ ఖాసిమ్ ముందు వరుసలో ఉన్నారు. అంతేకాకుండా నస్రాల్లా హత్య తర్వాత, యుద్ధ పరిష్కారం దిశగా నెయీమ్ ఖాసిమ్ తొలిసారిగా మాట్లాడారు. ఓ వైపు హెజ్‌బొల్లా చీఫ్ మరణంతో యుద్ధం ముగియలేదని హెచ్చరిస్తూనే, కాల్పుల విరమణే ఈ సమస్యకు పరిష్కారం చూపుతుందని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే అక్టోబరు 15న ఆయన ఓ ప్రకటన కూడా విడుదల చేశాడు.
అంతేకాదు హెజ్‌బొల్లా గ్రూప్ సభ్యులను ఏకతాటిపై తీసుకురావడంలో నెయీమ్ ఖాసిమ్ కీలకంగా వ్యవహరించారు. అందుకే సంస్థాగత సమస్యలు తలెత్తినప్పుడు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా వాటిని పరిష్కరిస్తారనే పేరు ఆయనకు ఉంది. ఖాసిమ్ బాగా మాట్లాడుతారు కూడా. నస్రల్లా మరణం తర్వాత, గ్రూప్ సభ్యులు డీలా పడిపోకుండా వారిలో స్ఫూర్తి నింపేందుకు ఖాసిమ్ 3 ప్రసంగాలు ఇచ్చినట్లు స్థానిక మీడియా కథనాలు వెలువరించింది.
కాల్పుల విరమణకు మద్దతు
ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలని లెబనాన్ పార్లమెంట్ స్పీకర్ నబీ బెర్రి ప్రయత్నాలు చేశారు. దానికి ఖాసిమ్ పూర్తి మద్దతు ఇచ్చారు. లెబనాన్‌లో దాడులు ఆపడానికి, గాజాలో యుద్ధం ముగియాలన్న షరతు పెట్టకుండా హెజ్‌బొల్లా మద్దతివ్వడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. "కాల్పుల విరమణ ఒప్పందం దిశగా లెబనాన్ స్పీకర్ చేస్తున్న రాజకీయ ప్రయత్నాలకు మేము మద్దతు ఇస్తున్నాం. కానీ ఒప్పందం కుదుర్చుకోకుండా లెబనాన్ పౌరులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడితే మాత్రం, చాలా గట్టిగా బుద్ధి చెబుతాం. ఆ దేశపు నడిబొడ్డున దాడి చేసే సత్తా మాకుంది" అంటూ ఖాసిం హెచ్చరించారు. అంటే ఓ వైపు సంధికి మొగ్గు చూపుతూనే, పరోక్షంగా ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు కూడా పంపారు ఖాసిం.
ఓ వైపు ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రత్యక్ష దాడులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో నూతన చీఫ్ ఖాసిం సారథ్యంలోని హెజ్‌బొల్లా కాల్పుల విరమణకు మొగ్గు చూపుతుందా? లేదా ఇరాన్‌కు మద్దతిస్తూ దాడులు కొనసాగిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
శరణార్థుల భవనంపై దాడి- 60మంది మృతి
శరణార్థులు ఆశ్రయం తీసుకుంటున్న భవనంపై మంగళవారం ఇజ్రాయెల్ చేసిన దాడిలో 60 మంది మరణించారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. 17మంది ఆచూకీ గల్లంతైందని ఫీల్డ్ ఆస్పత్రుల విభాగం డైరెక్టర్ డాక్టర్ మార్వాన్ అల్-హమ్స్ వెల్లడించారు. గత మూడు వారాలుగా గాజా ఉత్తర ప్రాంతంలో ఉన్న బీయిట్ లాహియా టౌన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే శరణార్థుల భవనంపై మంగళవారం ఉదయం దాడి జరిగింది.
ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో సరైన ఆహారం, వైద్య సదుపాయాలు లేక సుమారు లక్ష మంది పాలస్తీనియన్లు అలమటిస్తున్నారని పాలస్తీనియన్ సివిల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ పేర్కొంది. గాజాలోని ఆసుపత్రులో వైద్య సామగ్రి, మానవ వనరుల కొరత అధికంగా ఉందని ఆ దేశ అరోగ్య శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్ చేస్తున్న ఈ దాడులపై కౌన్సిల్ ఆన్ అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్ (సీఏఐఆర్) స్పందించింది. గాజాపై దాడులను విరమింపజేసి, సాధారణ పౌరుల ప్రాణాలు కాపాడాలని అగ్రరాజ్యం అమెరికాను కోరింది.