Hajj 2024 Death Toll : ఈ ఏడాది హజ్ యాత్రలో 1,300 మందికి పైగా మృతిచెందినట్లు సౌదీ అరేబియా అధికారిక వర్గాలు తెలిపాయి. తీవ్రమైన ఎండలు, ఉక్కపోత, వడగాలులే అందుకు కారణమమని పేర్కొన్నాయి. చనిపోయిన వారిలో 83 శాతం మంది చట్టవిరుద్ధంగా మక్కాకు వచ్చినవారేనని ఆదివారం వెల్లడించాయి. వీరిలో చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి భగభగమండే ఎండల్లో నడుచుకుంటూ హజ్ యాత్రకు వచ్చారని సౌదీ ఆరోగ్యశాఖ మంత్రి ఫహద్ బిన్ అబ్దుర్రహ్మాన్ అల్-జలజెల్ తెలిపారు. 95 మంది యాత్రికులకు చికిత్స అందుతున్నట్లు చెప్పారు.
క్షతగాత్రులను విమానంలో ఆస్పత్రికి తరలింపు
క్షతగాత్రుల్లో కొంత మందిని మెరుగైన చికిత్స కోసం విమానాల్లో సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు తరలించినట్లు మంత్రి ఫహద్ బిన్ అబ్దుర్రహ్మాన్ అల్-జలజెల్ తెలిపారు. ఎలాంటి పత్రాలు లేకపోవడం వల్ల మృతులను గుర్తించడం కష్టంగా మారినట్లు పేర్కొన్నారు. కొంతమందికి ఇప్పటికే మక్కాలో సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ ఏడాది హజ్ సమయంలో సౌదీలో ఉష్ణోగ్రతలు 46- 49 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. దీంతో మక్కాకు వెళ్లిన కొంత మంది ఎండవేడిమికి ప్రాణాలు వదిలారు.
మృతుల్లో ఈజిప్టు వాసులే ఎక్కువ
హజ్ యాత్రలో ఈజిప్టుకు చెందినవారు 660 మందికి పైగా మరణించారు. 31 మంది మినహా మిగతావారంతా అక్రమంగా హజ్ యాత్రకు వెళ్లినవారేనని ఆదేశ అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. వీరిని తీసుకెళ్లిన 16ట్రావెల్ ఏజెన్సీల లైసెన్సులను రద్దు చేసింది అక్కడి ప్రభుత్వం. ఈజిప్టు నుంచి ఈ ఏడాది మొత్తం 50 వేల మంది యాత్రికులు చట్టబద్ధ అనుమతితో హజ్‌కు వెళ్లినట్లు అధికారులు పేర్కొన్నారు.
వెనక్కి పంపిన అధికారులు
చట్టవిరుద్ధంగా హజ్ యాత్రకు వచ్చిన అనేక మందిని సౌదీ అధికారులు తిరిగి వెనక్కి పంపించారు. కొంత మంది భక్తులు ఎలాగోలా మక్కా సహా సమీప ప్రాంతాల్లోని పవిత్ర స్థలాలకు వచ్చారు. చట్టవిరుద్ధంగా వచ్చిన హజ్ యాత్రికులకు హోటళ్లు, గూడారుల వంటి వసతులు దొరక్కపోవడం వల్లే మరణాలు సంభవించాయని అధికారులు వెల్లడించారు. మృతుల్లో 165 మంది ఇండోనేషియా, 98 మంది భారతీయులు, పదుల సంఖ్యలో జోర్డాన్, టునీషియా, మొరాకో, అల్జీరియా, మలేషియా సహా ఇతర దేశాల వారు ఉన్నారని ఓ అంతర్జాతీయ వార్తాపత్రిక తెలిపింది. మృతుల్లో అమెరికా పౌరులిద్దరూ ఉన్నట్లు పేర్కొంది.
హజ్ యాత్రలో భక్తులు మరణించడం కొత్తేమీ కాదు. ఐదు రోజుల హజ్ యాత్ర కోసం ప్రతి ఏడాది ఏటా దాదాపు 20 లక్షల మంది వరకు సౌదీకి వెళ్తారు. 2015లో మైనాలో జరిగిన తొక్కిసలాటలో 2,400 మంది మరణించారు. అలాగే ఓ సారి మక్కాలో క్రేన్ కూలిన ఘటనలో 111 మంది చనిపోయారు. 1990లో జరిగిన తొక్కిసలాటలో 1,426 మంది ప్రాణాలు విడిచారు.
చర్చిలు, పోలీస్ స్టేషన్లపై ఉగ్రదాడి- 15మందికి పైగా పోలీసులు, పౌరులు మృతి- ఆరుగురు ఉగ్రవాదులు హతం
100 ఏనుగులకన్నా మేఘమే బరువు- నీటికి తడే ఉండదు- ఒక్కసారిగా షాక్ అయ్యారా? - Interesting Facts