Gaza Food Crisis : ఊపిరి సలపని యుద్ధంతో గాజాలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. పవిత్ర రంజాన్ మాసం దగ్గర పడుతున్నా కాల్పుల విరమణ కొలిక్కి వచ్చే అవకాశం ఇంకా కనిపించడం లేదు. మరోవైపు ఇజ్రాయెల్ దాడులతో గాజాలో 12 వందల మసీదుల దాకా ధ్వంసమయ్యాయి. ఇక్కడి శిథిలాలు రఫా నగరంలో అతిపెద్ద, పురాతనమైన అల్ ఫరూక్ మసీదుకు సంబంధించినవి. శుక్రవారం ఇక్కడకు భారీగా పెద్దలు, చిన్నారులు కాంక్రీటు శిథిలాల మధ్యే ప్రార్థనలు నిర్వహించారు. గాజాలో దెబ్బతిన్న మసీదుల పునర్నిర్మాణానికి దాదాపు 500 మిలియన్ల డాలర్ల ఖర్చవుతుందని అంచనా. ఈ యుద్ధం తమ సాంస్కృతిక వైభవాన్ని దెబ్బతీసిందని స్థానికులు వాపోతున్నారు. తాము ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగామని, ఎన్ని దాడులు జరిగినా తమ స్వస్థలాన్ని విడిచివెళ్లమని చెబుతున్నారు.
ఆహార పొట్లాల కోసం ఇక్కట్లు
గాజాలో విమానాల నుంచి పడే ఆహారం కోసం ప్రజలు ఎగబడుతున్న దృశ్యాలు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఆకాశంలో శబ్ధం వినిపిస్తే అది యుద్ధవిమానమా, మానవతాసాయం అందించే విమానమా అని తెలియని పరిస్థితి నెలకొంది. శుక్రవారం ఓ చోట ఆహార పొట్లాటను కిందకు జార విడవగా ప్రజలు ఒక్కసారిగా అటువైపుగా పరుగులు తీశారు. చిన్నపిల్లలు, పెద్దలు అన్నం కోసం ఎగబడ్డారు. కొందరు ఆహారం కోసం కొట్టుకున్నారు. ఓ యువతి అయితే తనకు దొరికిన ఆహార పొట్లాన్ని చూసి ఎగిరి గంతేసింది.
గాజా యుద్ధంపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వస్తుండటం వల్ల అమెరికా, ఐరోపా దేశాలు మానవతాసాయాన్ని పెంచాల్సిన పరిస్థితి వస్తోంది. ఇజ్రాయెల్ భీకర దాడులతో ట్రక్కుల ద్వారా మానవతాసాయం సరఫరాకు ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో చాలా దేశాలు ఎయిర్ డ్రాప్ పద్ధతిలో ఆహారాన్ని గాజాలో జారవిడుస్తున్నాయి. అవి పడిన ప్రదేశాల్లో తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యధరా తీరంలో ఒక తాత్కాలిక పోర్టును నిర్మించి అక్కడి నుంచి మానవతాసాయాన్ని సరఫరా చేస్తామని అమెరికా తెలిపింది.
గడిచిన 24 గంటల్లోనే నెతన్యాహు సేనలు ఖాన్‌యూనిస్, రఫా, అజ్ జవయ్దా, నుస్సేరత్ శరణార్థి శిబిరంపై నిర్వహించిన దాడుల్లో 78 మంది మరణించారు. 104 మంది తీవ్రంగా గాయపడ్డారు. యుద్ధంలో ఇప్పటివరకు గాజాలో దాదాపు 31 వేలమంది పౌరులు మరణించారు. అందులో 9 వేల మంది మహిళలే అంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అక్కడి ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆవేదన వ్యక్తం చేసింది. రోజుకు సగటున 63 మంది మహిళలు మరణిస్తున్నారని పేర్కొంది. కాగా గాజాలో 60 వేల మంది గర్భిణిలు పోషకాహార కొరత, డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి నెలా 5వేల మంది గర్భిణులు సురక్షితం కాని పరిస్థితుల్లో ప్రసవిస్తున్నట్లు పేర్కొన్నాయి.
గాజాలో మారణహోమం- సాయం కోసం ఎదురుచూస్తున్నవారిపై ఇజ్రాయెల్ దాడి- 70మంది మృతి
హమాస్ ఆయువుపట్టుపై దెబ్బ- 10కి.మీ సొరంగం ధ్వంసం- గాజా పరిస్థితిపై భారత్ ఆందోళన