France New PM : అవిశ్వాస తీర్మానంలో ప్రధాని మిషెల్ బార్నియర్ ప్రభుత్వం కుప్పకూలడంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ స్పందించారు. తాను అధికార బాధ్యతల నుంచి తప్పుకోనని, త్వరలోనే కొత్త ప్రధానిని నియమిస్తానని తెలిపారు. ఫ్రాన్స్ పార్లమెంటులో ప్రధాని మిచెల్ బార్నియర్ ప్రభుత్వం కుప్పకూలిపోవడం వల్ల అధ్యక్షుడిగా ఉన్న ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ కూడా బాధ్యతల నుంచి వైదొలగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలిసీ ప్యాలెస్ నుంచి మెక్రాన్ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఈ మేరకు వాఖ్యలు చేశారు.
'ఆ బాధ్యత నాపై ఉంది'
'రానున్న రోజుల్లో ఒక ప్రధానమంత్రిని నియమిస్తా. మీరు ఐదేళ్లు పరిపాలించమని నాకు ఇచ్చిన అధికారాన్ని పూర్తి చేస్తాను. అన్ని వ్యవస్థలను సక్రమంగా నడిపిస్తా. ప్రజలను రక్షిస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా నాపై ఉంది. సామాజిక సంక్షోభాలు, ద్రవ్యోల్బణం, కొవిడ్ వంటి ఎన్నో ఉన్నాయి. వాటిని ఎదుర్కొని ముందుకుసాగుతున్నాం. అసాధ్యమైన వాటిని చేసి చూపించాం. మన ముందున్న 30 నెలలు దేశానికి ఉపయోగకరమైన చర్యగా ఉండాలి' అని మెక్రాన్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు ఆపద్ధర్మ పదవిలో కొనసాగాలని బార్నియర్‌ను కోరారు.
60 ఏళ్లలో ఇదే తొలిసారి
గత జులైలో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ నూతన ప్రధానిగా మిషెల్ బార్నియర్‌ను నియమించారు. ఈక్రమంలోనే తాజాగా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. మితవాద, అతివాద చట్టసభ సభ్యులు ఒక్కటై అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. అసెంబ్లీలో మొత్తం 577 ఓట్లు ఉండగా, ప్రధానికి వ్యతిరేకంగా 331 ఓట్లు పడ్డాయి. జాతీయ అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం నెగ్గడం 60 ఏళ్లలో ఇదే తొలిసారి. ఆయన ప్రధానిగా కేవలం మూడు నెలలు మాత్రమే ఉన్నారు. అత్యంత తక్కువకాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగానూ బార్నియర్ నిలిచారు. అంతేకాకుండా ఫ్రాన్స్ చరిత్రలో 1962 తర్వాత అవిశ్వాస తీర్మానంతో పదవి నుంచి వైదొలగనున్న తొలి ప్రధానిగా బార్నియర్ నిలవనున్నారు.