Drone Attack At Israel PM House : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నివాసం లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగింది. శనివారం జరిగిన ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఇజ్రాయెల్ ప్రభుత్వం పేర్కొంది. దాడి జరిగిన సమయంలో నెతన్యాహు, ఆయన సతీమణి నివాసంలో లేరని వెల్లడించింది. హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ మరణం తర్వాత ఈ దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
శనివారం ఉదయం లెబనాన్వైపు నుంచి డ్రోన్లు దూసుకొస్తున్న తరుణంలో ఇజ్రాయెల్ సైరన్లు మోగాయి. మూడు డ్రోన్లు దూసుకొచ్చినట్లు ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి. డ్రోన్లలో ఒకటి సిజేరియాలోకి భవనాన్ని ఢీకొట్టినట్లు తెలిపాయి. మరో రెండింటిని పేల్చివేసినట్లు ఐడీఎఫ్ పేర్కొంది. మరోవైపు సిన్వర్ మృతి తర్వాత స్పందించిన హెజ్‌బొల్లా తమ పోరాట దశను మార్చేలా ప్రణాళికలు వేసుకున్నామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో క్షిపణులు, డ్రోన్లతో దాడులు తీవ్రం చేస్తున్0నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం హైఫా నగరం సహా ఉత్తర ఇజ్రాయెల్ వైపు మొత్తం 55 క్షిపణులు దూసుకొచ్చినట్లు ఐడీఎఫ్ తెలిపింది. వందల వేల మంది ఇజ్రాయెలీలు సురక్షిత ప్రాంతాలకు బంకర్లలోకి వెళ్లిపోయినట్లు పేర్కొంది.
'బందీలను విడుదల చేస్తే యుద్ధం ముగిస్తాం'
సిన్వర్ మృతితో యుద్ధం కీలకమలుపు తిరిగే అవకాశం ఉందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ తమ బందీలు విడుదలయ్యేవరకు పోరాటం ఆగదని స్పష్టం చేసింది. హమాస్ మిలిటెంట్లు ఆయుధాలను వదిలి బందీలను విడుదల చేస్తే వెంటనే యుద్ధం ముగిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఆపై హమాస్ తీవ్రవాదులు జనజీవన స్రవంతిలో కలిసి సాధారణ జీవితం గడిపే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. లేదంటే వెంటాడి మరీ వారిని హతమరుస్తామని హెచ్చరించారు.
అందుకు తగ్గట్టుగానే ఉత్తర గాజాలోని జబాలియా శిబిరంపై శుక్రవారం రాత్రి ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో 33 మంది పాలస్తీనా వాసులు మృతి చెందారు. వారిలో 21 మంది మహిళలే ఉన్నారు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇప్పటివరకు 42,500 మందికి పైగా మృతి చెందినట్లు గాజా ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.