Covishield Side Effects : కొవిడ్ టీకా కోవిషీల్డ్‌తో అరుదుగా దుష్పరిణామాలు ఏర్పడే ప్రమాదం ఉందని బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా అంగీకరించింది. ఈ మేరకు బ్రిటన్‌కు చెందిన ప్రముఖ దినపత్రిక ది టెలిగ్రాఫ్ ఓ కథనం ప్రచురించింది. కోవిషీల్డ్ టీకా వల్ల అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్ కౌంట్ పడిపోవటం వంటి పరిస్థితులకు దారితీయవచ్చని కోర్టుకు సమర్పించిన దస్త్రాల్లో పేర్కొనట్లు తెలిపింది.
అరుదైన సందర్భాల్లో సెడ్ ఎఫెక్ట్స్!
ఆస్ట్రాజెనెకాపై బ్రిటన్‌లో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కోవిషీల్డ్ కరోనా టీకా అనేక సందర్భాల్లో మరణాలతోపాటు తీవ్ర గాయాలకు కారణమైనట్లు ఆరోపిస్తూ బ్రిటన్ హైకోర్టులో 50మందికిపైగా బాధితులు 100 మిలియన్ పౌండ్ల నష్ట పరిహారం కోరుతూ కేసులు వేశారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన ఆస్ట్రాజెనెకా, అరుదైన సందర్భాల్లో సెడ్ ఎఫెక్ట్స్ కలిగే అవకాశం ఉందని ఫిబ్రవరిలో కోర్టుకు సమర్పించిన ఓ నివేదికలో పేర్కొంది.
పలు వార్తా కథనాల ప్రకారం, కోవిషీల్డ్ టీకాను తీసుకున్న తర్వాత తన రక్తం గడ్డకట్టిందని, పని చేయలేకపోతున్నానని జేమ్స్ స్కాట్ అనే వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. అతడు ఇద్దరు పిల్లల తండ్రి. 2021 ఏప్రిల్‌లో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోగా, అతడి మెదడుకు శాశ్వతంగా గాయమైందని తెలుస్తోంది. వైద్యులు కూడా జేమ్స్ స్కాట్ చనిపోతాడని ఆయన భార్యకు చెప్పినట్లు సమాచారం.
అప్పుడు అలాా- ఇప్పుడు ఇలా!
అయితే కరోనా సమయంలో కోవిషీల్డ్ టీకాను బ్రిటన్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అభివృద్ధి చేసింది. భారత్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసింది. ఈ టీకాలనే దేశంలో విస్తృతంగా వినియోగించారు. దేశవ్యాప్తంగా చాలా మంది ఈ టీకాను తీసుకున్నారు. వాస్తవానికి టీటీఎస్(రక్తం గడ్డ కట్టడం)ను ఇంతకాలం ఆస్ట్రాజెనెకా కంపెనీ అంగీకరించలేదు. సాధారణ స్థాయిలో టీటీఎస్ వస్తుందని తాము అంగీకరించమని చెప్పింది. కానీ ఇప్పుడు లీగల్ డాక్యుమెంట్లో 'ఏజెడ్ వ్యాక్సిన్‌తో చాలా అరుదైన ఘటనల్లో టీటీఎస్ కలగొచ్చు. దీని మెకానిజం మాకు తెలియదు' అని ఉంది.