Covishield About Heart Attack: తమ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న పలువురిలో రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్లు పడిపోవడం వంటి దుష్ప్రభావాలు తలెత్తాయని బ్రిటిష్- స్వీడిష్ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా ఇటీవల చేసిన ప్రకటన కలకలం సృష్టించింది. ఇదే వ్యాక్సిన్‌ను భారత్‌లో 'కొవిషీల్డ్' పేరుతో తయారు చేసి విక్రయించారు. అందుకే ఆస్ట్రాజెనెకా ప్రకటన ఎంతోమంది భారతీయులను కూడా ఆందోళనలోకి నెట్టేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆస్ట్రాజెనెకా మరో వివరణ ఇచ్చింది. తమ కరోనా టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రయోగ పరీక్షల్లో ఆస్ట్రాజెనెకా (కొవిషీల్డ్) వ్యాక్సిన్ సక్సెస్ రేటు మెరుగ్గా వచ్చిందని, దానికి సంబంధించిన బలమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ప్రకటించింది.
'మా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్న వారికి, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులకు మా ప్రగాఢ సానుభూతి. రోగుల భద్రతకే మేం ఎల్లప్పుడూ తొలి ప్రాధాన్యం ఇస్తాం. ఔషధ నియంత్రణ సంస్థల ఆరోగ్య ప్రమాణాలను మేం తప్పక పాటిస్తాం' అని ఆస్ట్రాజెనెకా కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఆస్ట్రాజెనెకా (కొవిషీల్డ్) వ్యాక్సిన్ తీసుకున్న పలువురిలో థ్రాంబోసిస్ థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ (టీటీఎస్) సమస్య వచ్చిందని ఇటీవల ఆస్ట్రాజెనెకా కంపెనీ అంగీకరించింది. ఈమేరకు బ్రిటన్‌లోని ఓ కోర్టుకు లిఖితపూర్వక సమాధానాన్ని కూడా అందించింది. మరోవైపు ప్రపంచంలోని అన్ని దేశాల ఔషధ నియంత్రణ సంస్థలు నేటికీ కరోనా వ్యాక్సిన్లను సమర్ధిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్లు వేసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య భద్రత కంటే ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు చాలా తక్కువేనని వాదిస్తున్నాయి.
ఆస్ట్రాజెనెకాను ఇండియాలో ఇలా తయారు చేశారు
ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ ఫార్ములాతో మన దేశంలోని పుణెకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కంపెనీ టీకాను తయారు చేసింది. దాని పేరే కొవిషీల్డ్. ఆస్ట్రాజెనెకా కంపెనీ కరోనా వ్యాక్సిన్ తయారీకి ఎంఆర్ఎన్ఏ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించగా టీకా తయారీకి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ వైరల్ వెక్టర్ ప్లాట్‌ఫామ్‌ను వాడింది. ఇందులో భాగంగా కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్‌ను మనుషుల రోగ నిరోధక కణాల్లోకి తీసుకెళ్లేందుకు వాహకంగా చింపాంజీ అడినోవైరస్‌ను వినియోగించారు.
ఇది మన శరీరంలోకి ప్రవేశించి కరోనా వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలనేది మన రోగ నిరోధక వ్యవస్థకు నేర్పిస్తుంది. ఎలా అంటే కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసి చింపాంజీ అడినో వైరస్‌లోకి ప్రవేశపెడతారు. ఈ ఫార్ములాయే కొవిషీల్డ్ వ్యాక్సిన్‌లో ఉంటుంది. ఇది మన శరీరంలోకి ప్రవేశించాక రోగ నిరోధక వ్యవస్థ యాక్టివేటై వెంటనే చింపాంజీ అడినో వైరస్‌పైకి దాడి చేస్తుంది. అందులో ఉండే కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్‌పైనా ఎటాక్ చేస్తుంది. ఈ క్రమంలో అదెలా ఉందనే దానిపై మన రోగ నిరోధక వ్యవస్థకు అవగాహన వస్తుంది. తద్వారా భవిష్యత్తులో మన శరీరంలోకి ఒకవేళ కరోనా వైరస్ ప్రవేశిస్తే వెంటనే గుర్తించి సమర్ధంగా నిరోధించేలా మన రోగ నిరోధక వ్యవస్థ రెడీ అవుతుంది.
గబ్బిలాల నుంచి కొత్త రకం వైరస్- కరోనా స్థాయిలో విజృంభణ!
కొవిడ్ వ్యాక్సిన్‌కు గుండెపోటుకు సంబంధం లేదు : డాక్టర్ బలరాం భార్గవ