Chinese Defense Minister Missing : చెనా మాజీ రక్షణ మంత్రి మంత్రి జనరల్ వీ ఫెంఘే(70) ఎట్టకేలకు కనిపించారు. గతేడాది అక్టోబరు నుంచి కనిపించకుండా పోయిన వీ ఫెంఘేకు ఏమైంది? ఎక్కడికి వెళ్లారు? అనే దానిపై వాడివేడి చర్చ జరుగుతున్న తరుణంలో ఆయన దర్శనమివ్వడం వల్ల అందరి అపోహలు పటాపంచలయ్యాయి. చైనా సీనియర్ శాసనసభ్యుడు ఓయున్ కెమాగ్ (81) కన్నుమూయగా, ఆయనకు నివాళులర్పించిన ప్రముఖుల్లో మాజీ రక్షణ మంత్రి వీ ఫెంఘే కూడా ఉన్నారు. కొన్ని నెలల పాటు వీ ఫెంఘే ఎవరికీ కనిపించనప్పటికీ, ఇప్పుడు ముఖ్య కార్యక్రమాల్లో నేరుగా పాల్గొంటుండం వల్ల ప్రభుత్వం నుంచి ఆయనకు ఎలాంటి ముప్పూ లేదని స్పష్టమైంది. ఈ మేరకు హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. చైనా అధికారిక న్యూస్ ఛానల్ 'సీసీటీవీ' కూడా దీనిపై వార్తను ప్రసారం చేసింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో పాటు మాజీ రక్షణ మంత్రి వీ ఫెంఘే సైతం ఓయున్ కెమాగ్‌కు నివాళులు అర్పించారని పేర్కొంది.
ఆ ఇద్దరు నేటికీ పత్తా లేరు
వీ ఫెంఘే తర్వాత చైనా రక్షణ మంత్రి పదవిని చేపట్టిన జనరల్ లి షాంగ్ఫు కూడా తొలుత అదృశ్యమయ్యారు. ఆ తర్వాత ఆయన్ను పదవి నుంచి తొలగించినట్లు తెలిసింది. గతేడాది చైనా విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో క్విన్ గ్యాంగ్ కనిపించకుండాపోయారు. అనంతరం ఆయన్ను పదవి నుంచి తొలగించినట్లు ప్రకటన వెలువడింది. లి షాంగ్ఫు, క్విన్ గ్యాంగ్ నేటికీ బయట ఎక్కడా కనిపించలేదు. వారు ఎక్కడున్నారు? ఏమయ్యారు? అనేది ఎవరికీ తెలియదు.
వీ ఫెంఘే ఇప్పుడు సేఫేనా?
చైనా క్షిపణి దళాన్ని ఇప్పుడు 'పీఎల్‌ఏ రాకెట్ ఫోర్స్' పేరుతో పిలుస్తున్నారు. 2015 డిసెంబరు 31న పీఎల్‌ఏ రాకెట్ ఫోర్స్ ఏర్పడగానే తొలిసారి వీ ఫెంఘే సారథ్యం వహించారు. ఈయన తర్వాత పీఎల్ఏ రాకెట్ ఫోర్స్‌కు లి షాంగ్ఫు సుదీర్ఘకాలం పాటు నాయకత్వం వహించారు. అయితే దేశ రక్షణమంత్రిగా ఉన్న సమయంలో మిస్సయిన లి షాంగ్ఫు నేటికీ కనిపించలేదు. కానీ వీ ఫెంఘే మాత్రం మిస్సయ్యాక తిరిగి జనం నడుమ కనిపించారు. ఏకంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వంటి వారితో కలిసి ప్రైవేటు కార్యక్రమాల్లో వీ ఫెంఘే పాల్గొంటున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో ఆయనకు గ్యాప్ లేదనే విషయం దీనితో స్పష్టమైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందుకున్న 130 మంది విశ్రాంత సీనియర్ అధికారుల జాబితాలో వీ ఫెంఘే పేరు లేదు. అయితే తాజా పరిణామాలను బట్టి ఇప్పుడు పరిస్థితులు మారాయని స్పష్టమవుతోంది. కమ్యూనిస్టు పార్టీ అధినాయకత్వంతో వీ ఫెంఘే గ్యాప్ చెరిగిపోయిందని అర్థమవుతోంది.
రక్షణ మంత్రులపై వేటుకు కారణం అదే?
సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) వైస్ ఛైర్మన్ జనరల్ హీ వీడాంగ్ ఈ ఏడాది మార్చిలో చైనా వార్షిక పార్లమెంటు సమావేశాలు వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా రాకెట్ ఫోర్స్ సహా వివిధ ఆర్మీ యూనిట్లు ఫేక్ ఆర్మీ డ్రిల్స్‌కు దూరంగా ఉండాలని హితవు పలికారు. నిజమైన సైనిక విన్యాసాలే చేయాలని సూచించారు. ఆర్మీ యూనిట్లలో నకిలీ సైనిక డ్రిల్స్‌ను నిర్వహించి, ఆర్థిక అవకతవకలకు పాల్పడినందు వల్లే రక్షణ మంత్రులపై చైనా వేటు వేస్తూ వస్తోందనే అంచనాలు వెలువడుతున్నాయి. గతేడాది ఇవే ఆరోపణలతో కీలకమైన తొమ్మిది మంది సీనియర్ జనరల్స్‌ను ఆర్మీ నుంచి చైనా సర్కారు తొలగించింది.
China Minister Removed : చైనా రక్షణ మంత్రి తొలగింపు.. 2నెలలుగా కనిపించకుండా పోయారని..