Bangladesh Minorities Attacked : బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా మైనారిటీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మొత్తం 52 జిల్లాల్లో మైనారిటీలపై 205 వరకు దాడులు జరిగినట్లు పలు హిందూ సంస్థలు పేర్కొన్నాయి. ఈ మేరకు బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్, బంగ్లాదేశ్ పూజ ఉడ్జపాన్ పరిషత్‌లు శుక్రవారం తాత్కాలిక పాలకుడు ముహమ్మద్ యూనుస్‌కు లేఖ రాశాయి.
'బంగ్లాదేశ్‌లో మేము రక్షణ కోరుతున్నాం. మా జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి. రాత్రంతా నిద్ర పోకుండా ఇళ్లకు, ఆలయాలకు కాపలాగా ఉంటున్నాం. ప్రభుత్వం వెంటనే మతపరమైన ప్రశాంతతను నెలకొల్పాలి' అని హిందూ సంస్థలు లేఖలో పేర్కొన్నాయి. మరోవైపు బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌కు, కాంగ్రెస్ సభ్యులు శ్రీ థనేదార్, రాజా కృష్ణమూర్తి వేర్వేరుగా లేఖలు రాశారు.
దాడులను ఖండించిన యూనుస్
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరిగిన దాడులను తాత్కాలిక పాలకుడు ముహమ్మద్ యూనుస్ ఖండించారు. వాటిని అరికట్టేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని శనివారం అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ దాడులను ఖండించింది. బంగ్లాదేశ్‌లోని మైనారిటీల్లో విశ్వాసం నింపేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వానికి శనివారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ సూచించారు.
సీజేఏ, కేంద్ర బ్యాంకు గవర్నర్ రాజీనామా
బంగ్లాదేశ్ ఆందోళనకారులు ఎక్కడా తగ్గడం లేదు. ఈసారి సుప్రీంకోర్టును లక్ష్యంగా చేసుకున్న నిరసనకారులు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టును ముట్టడించి నిరసనలు చేపట్టారు. న్యాయ వ్యవస్థను సంస్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసన్ వెంటనే రాజీనామా చేశారు. కొన్ని గంటల తర్వాత మరో ఐదుగురు న్యాయమూర్తులు కూడా వైదొలగారు. ఈ ఆందోళనల నేపథ్యంలో బంగ్లాదేశ్ కేంద్ర బ్యాంకు గవర్నర్ అబ్దుర్ రౌఫ్ తాలూక్దార్ కూడా తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఆయనకు ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉంది. 2022 జూలైలో బంగ్లా బ్యాంక్ గవర్నర్‌గా అబ్దుల్ రౌఫ్ బాధ్యతలు స్వీకరించారు.
హసీనా గద్దె దిగాక కూడా హింసే- 3రోజుల్లో 232మంది మృతి- ఆజ్యం పోసింది పాకిస్థానే! - Bangladesh Crisis