టేపుతో గోడకు అంటించినట్లు కనపడుతున్న ఈ అరటిపండును చిన్న పిల్లలు ఆకతాయితనంతో చేసిన పనిగా భావిస్తే మీరు పొరపడినట్లే! ఎందుకంటే ఆ అరటిపండు ఓ ప్రముఖ కళాకారుడు తీర్చిదిద్దిన కళాకృతి. దాని ఖరీదు అక్షరాల 52 కోట్ల రూపాయలు. డక్ట్‌టేప్డ్ బనానాగా పేరు గాంచిన ఈ అరటిపండు కళాకృతిని "కమెడియన్" పేరిట ఇటాలియన్ ఆర్టిస్ట్ మౌరిజియో కాటెలాన్ సృష్టించారు.
వేలంలో 52 కోట్ల రూపాయలు
Banana Taped To Wall Art Value : తాజాగా ఆ డక్ట్‌టేప్డ్ బనానాను న్యూయార్క్‌లో సోథ్‌బే సంస్థ నిర్వహించిన వేలంలో ఉంచారు. అరటి పండు కళాఖండాన్ని వేలంలో 52 కోట్ల రూపాయలకు క్రిప్టోకరెన్సీ వ్యవస్థాపకుడు జస్టిన్ సన్ దక్కించుకున్నారు. వేలంలో భారీ ధర దక్కించుకోవడం వల్ల డక్ట్ టేపుడ్ బనానా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.
కమెడియన్ పేరిట చేసిన ఆ అరటి పండు ఆర్ట్ వర్క్‌ను 2019లో తొలిసారి మయామీ బీచ్ ఆర్ట్ బాసెల్‌లో ప్రదర్శించారు. ఆర్ట్ వర్క్‌లో భాగంగా ప్రతి మూడు రోజులకోసారి అరటిపండును నిర్వాహకులు మారుస్తుంటారు. ఈ నేపథ్యంలో బనానా టేప్‌ను కళాఖండంగా భావించాలా? వద్దా? అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి. ఎన్ని చర్చలు జరుగుతున్నప్పటికీ వేలంలో దాని ధర పెరుగుతూనే వచ్చింది.
షాక్‌లో నిర్వాహకులు!
ఐదేళ్ల క్రితం ఈ కళాఖండం సుమారు కోటి రూపాయలకు అమ్ముడుపోయి వేలందారులను ఆశ్చర్యపరచగా తాజాగా 52 కోట్ల రూపాయల ధర పలకడం వేలం నిర్వహకులను షాక్‌కు గురిచేసింది. ఇది ఆర్ట్‌వర్క్ మాత్రమే కాదని ఆర్ట్, మీమ్స్, క్రిప్టో కరెన్సీ కలగలిసిన ప్రపంచాలను ఇది ప్రతిబింబిస్తోందని జస్టిన్ సన్ వెల్లడించారు.
మరోవైపు, గత ఏడాది దక్షిణ కొరియాలోని ఓ మ్యూజియంలో నిర్వహించిన ప్రదర్శనలో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. సందర్శనకు వచ్చిన ఓ విద్యార్థి ఈ ఆర్ట్ వర్క్‌లోని అరటి పండును తిన్నాడు. పండును తిన్న తర్వాత ఆ అరటి తొక్కను తిరిగి టేపుతో గోడకు అంటించాడు. ఈ విషయం తెలిసిన నిర్వాహకులు అతడిని ప్రశ్నించగా తనకు బాగా ఆకలి వేయడం వల్ల గోడపై అంటించిన అరటిపండును తిన్నట్లు విద్యార్థి తెలిపాడు.