Australia Mall Attack : ఆస్ట్రేలియా సిడ్నీలోని వెస్ట్ ఫీల్డ్ బోండి జంక్షన్ షాపింగ్ సెంటర్లో పలువురిపై కత్తితో దాడికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు మట్టుబెట్టారు. దుండగుడి దాడిలో ఓ చిన్నారి సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. నిందితుడొక్కడే కత్తి దాడికి పాల్పడ్డాడని స్పష్టం చేశారు. నిందితుడి వివరాలు తెలియాల్సి ఉందన్న అధికారులు, కత్తి దాడులకు పాల్పడటానికి గల కారణంపై విచారణ చేస్తున్నట్టు చెప్పారు. మాల్‌లో ఉన్న వారిని సిబ్బంది వెంటనే అక్కడి నుంచి తరలించడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.
వెస్ట్ ఫీల్డ్ బోండి జంక్షన్ షాపింగ్ సెంటర్లో ఓ వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో దాడులకు పాల్పడుతున్నట్టు సమాచారం రావడం వల్ల పోలీసులు, అత్యవసర సేవల బృందాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నాయి. దుండగుడు అకస్మాత్తుగా మాల్‌లో కత్తితో జనంపై విరుచుకుపడ్డాడని, సుమారు తొమ్మిది మందిపై దాడి చేశాని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఆంథోని కూకె చెప్పారు. నిందితుడిపై కాల్పులు జరపడం వల్ల నిందితుడు హతమైనట్టు ఆయన వెల్లడించారు. అయినప్పటికీ ఇంకా ఎవరైనా దుండగులు ఉన్నారన్న అనుమానంతో పోలీసులు చాలా సేపు సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. దుండగుడు ఒక్కడే కత్తి దాడికి పాల్పడినట్టు తెలియడం వల్ల విరమించారు. అయితే, దుండగుడు ఏ ఉద్దేశంతో ఈ దాడికి పాల్పడ్డాడో తెలియరాలేదు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రధాని దిగ్భ్రాంతి
సిడ్నీ షాపింగ్ మాల్‌లో జరిగిన దాడిపై ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోని ఆల్బెన్సే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది అత్యంత విషాదకరమైన ఘటన అని చెప్పారు. బాధిత కుటుంబాల బాధ తనను కలిచివేస్తోందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
US Shooting Today : అంతకుముందు అమెరికాలో ఇలాంటి ఘటన జరిగింది. ఇల్లినాయీస్ రాష్ట్రంలోని జోలియెట్ పట్టణంలో ఓ దుండగుడు తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకొని చనిపోయాడని టెక్సాస్ అధికారులు తెలిపారు. షికాగోకు 50 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి