US Elections 2024 Michigan Voters : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసే స్వింగ్ స్టేట్స్‌లో మరో కీలక రాష్ట్రం మిషిగన్. ఈ రాష్ట్రంలో అరబ్-అమెరికన్లు ఎక్కువగా ఉంటారు. గాజాపై యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఇవ్వటాన్ని అరబ్-అమెరికన్ ఓటర్లు హర్షించటం లేదు. ఈ అంశం కమలా హారిస్‌కు ప్రతికూలంగా మారింది. అరబ్ దేశాల నుంచి వచ్చే ముస్లింలను అడ్డుకుంటానని గతంలో ట్రంప్ చేసిన ప్రసంగాన్ని డెమొక్రటిక్ మద్దతుదారులు తెరపైకి తెస్తున్నారు. దీంతో మిషిగన్ ఓటర్లు ఎవరివైపు నిలబడతారనేది ఆసక్తికరంగా మారింది.
ఇజ్రాయెల్ యుద్దం ప్రభావం
అమెరికాలోని స్వింగ్ స్టేట్స్‌లో ఉన్న మిషిగన్‌లో 15 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. దాదాపు కోటి మంది జనాభా ఉన్న మిషిగన్‌లో అరబ్-అమెరికన్ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. దీంతో గాజా, లెబనాన్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ఎన్నికల్లో కీలక అంశంగా మారాయి. ఇజ్రాయెల్‌కు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వెన్నుదన్నుగా నిలుస్తుండటం వల్ల అరబ్-అమెరికన్ ఓటర్లు డెమొక్రటిక్ పార్టీ పట్ల గుర్రుగా ఉన్నారు. ఫిబ్రవరిలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ గెలిచినా లక్ష మంది ఓటర్లు మాత్రం బ్యాలెట్ పేపర్‌పై అన్‌కమిటెడ్ అనే ఆప్షన్‌ను ఎంచుకున్నారు. ఇజ్రాయెల్‌కు సైనిక సాయాన్ని నిలిపివేయాలన్న డిమాండ్‌తో ఓటర్లు అప్పట్లో ఆ ఆప్షన్‌ను ఎంచుకున్నారు. గాజాలో ఇజ్రాయెల‌్ తమ ఆపరేషన్‌ను త్వరగా ముగించాలని ఇరు పార్టీల అధ్యక్ష అభ్యర్థులు తమ తమ ప్రచారాల్లో చెబుతున్నారు. గత ఎన్నికల్లో బైడెన్ వైపు మొగ్గు చూపిన మిషిగన్ ఓటర్లు, 2016లో మాత్రం ట్రంప్‌నకు మద్దతు తెలిపారు.
కమలా హారిస్‌కు ప్రతికూలం
పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలు డెమొక్రటిక్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. గాజాపై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్‌కు బైడెన్ ప్రభుత్వం సైనిక సాయంతో పాటు ఆర్థిక సాయం చేస్తోంది. దీంతో అరబ్-అమెరికన్, ముస్లిం ఓటర్లు కమలా హారిస్‌కు మద్దతు తెలుపుతారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ యుద్ధం మరింత విస్తరిస్తుండటం ఎన్నికల్లో కమలా హారిస్‌కు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మిషిగన్‌లో మధ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికాకు చెందిన 3 లక్షల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఇజ్రాయెల్‌పై బైడెన్ ప్రభుత్వ వైఖరి పట్ల వారు అసంతృప్తిగా ఉన్నారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. తనకు తెలిసినంత వరకు కమలా హారిస్‌కు ఎవరు ఓటు వేయరని ఇస్లామిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకుడు ఇమామ్ హసన్ తెలిపారు. 2020లో బైడెన్‌కు ఓటు వేశానని తెలిపిన ఆయన, ఈసారి మాత్రం స్వతంత్ర అభ్యర్థికి ఓటు వేస్తానని చెప్పారు.
యూదుల మద్దతు కోసం విశ్వ ప్రయత్నాలు
గత వారం చేసిన డజనకుపైగా ఇంటర్య్వూల్లో ఇద్దరు మాత్రమే కమలకు ఓటు వేస్తామని చెప్పారని ఓ అంతర్జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది. ఒక వర్గానికి చెందిన వారినే ఇంటర్య్వూ చేశామని తెలిపింది. మిషిగన్‌లో యూదులు కూడా స్వల్పంగా ఉన్నారు. వారు ఎప్పట్నుంచో డెమొక్రటిక్ పార్టీకి మద్దతుగా ఉంటున్నారు. యూదుల్లో ఎక్కువ మంది కమలా హారిస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని హేలీ స్టీవెన్స్ అనే డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారు తెలిపారు. యూదుల మద్దతు కూడగట్టేందుకు అటు రిపబ్లికన్ పార్టీ కూడా సర్వశక్తులు ఒడ్డుతోంది.
అరబ్ దేశాల నుంచి వచ్చే ముస్లింలను అడ్డుకుంటానని గతంలో ట్రంప్ చేసిన ప్రసంగాలను డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇరాన్‌కు చెందిన అణుకేంద్రాలపై దాడి చేయమని ఇటీవల ఇజ్రాయెల్‌కు ట్రంప్ సూచించడాన్ని ఓటర్లకు గుర్తు చేస్తున్నారు. ముస్లింలకు చెందిన మత పెద్దలను కలుస్తూ వారి మద్దతు కూడగట్టేందుకు కమలా హారిస్ ప్రయత్నిస్తున్నారు. అరబ్-అమెరికన్ ప్రజాప్రతినిధుల నుంచి ఇటీవలే ఆమె విరాళాలను కూడా పొందారు.