World Bicycle Day History and Health Benefits of Cycling: ప్రస్తుత రోజుల్లో బిజీబిజీ లైఫ్‌స్టైల్ కారణంగా చాలా మంది వ్యాయామానికి దూరమవుతున్నారు. ఆహార అలవాట్లలో మార్పులు, శారీరక శ్రమ తక్కువ కావడం, గంటల తరబడి ఒకే దగ్గరే కూర్చోవడం వంటివి అధిక బరువు, ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి. అయితే గంటల తరబడి ఎక్సర్సైజ్లు చేయకపోయినా.. రోజులో కొద్దిసేపు సైక్లింగ్ చేయడం బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. రోజూ కొద్దిసేపు సైకిల్ వినియోగిస్తే.. ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండటంతో పాటు, శరీరానికి వ్యాయామం అందుతుందని అంటున్నారు. ఈరోజు(జూన్ 3) ‘ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా సైకిల్ తొక్కడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..
వరల్డ్ సైకిల్ డే చరిత్ర: ప్రతి సంవత్సరం జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఆలోచనను మొదట యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన పోలిష్-అమెరికన్ సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ లెస్జెక్ సిబిల్స్కీ ప్రతిపాదించారు. దీనికి తుర్క్మెనిస్తాన్ సహా 56 ఇతర దేశాల నుంచి మద్దతు పొందాడు. దీంతో ఏప్రిల్ 2018లో, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రతి సంవత్సరం జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని జరుపుకోవాలని అధికారికంగా ప్రకటించింది.
సైకిల్ తొక్కడం వల్ల కలిగే లాభాలు:
బరువు తగ్గడం: సైక్లింగ్‌తో కొవ్వు వేగంగా కరుగుతుందని నిపుణులు అంటున్నారు. దీంతో శరీర బరువును కూడా వేగంగా తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. అధిక శరీర బరువుతో ఇబ్బందులు పడేవారికి సైక్లింగ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని.. దాదాపు 45-60 నిమిషాల సైక్లింగ్ 300 కేలరీలు బర్న్ చేయడంలో సహాయపడుతుందని అంటున్నారు.
కండరాలను పెంచుతుంది: సైక్లింగ్ మీ కాళ్లు, తుంటి, కోర్ కండరాలను బలోపేతం చేస్తుందని అంటున్నారు. కండరాలకు సైక్లింగ్ మంచి వర్కవుట్ అని.. ఫిట్‌గా ఉండాలంటే క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయాలని అంటున్నారు.
గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది: సైక్లింగ్ గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో బాగా సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. అనేక సార్లు కార్డియాక్ అరెస్ట్ ,ఇతర సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. రెగ్యులర్ సైక్లింగ్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని.. శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్, పోషకాలను మరింత సమర్థవంతంగా తీసుకువెళ్లడంలో సహాయపడుతుందని అంటున్నారు.
నెల రోజులపాటు నాన్‌వెజ్ తినకపోతే - ఏం జరుగుతుందో తెలుసా ? - Stop Eating Non Veg For A Month
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: సైకిల్ తొక్కడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని.. అనారోగ్యాలకు గురయ్యే అవకాశం తగ్గుతుందని పేర్కొన్నారు. అలాగే మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలను కూడా తగ్గిస్తుందని అంటున్నారు.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది: కొన్ని అధ్యయనాలు సైక్లింగ్ కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని సూచిస్తున్నాయి. 2017లో అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం వారానికి 150 నిమిషాల పాటు సైక్లింగ్ చేసే పురుషులకు కొలన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 20% తక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో న్యూట్రిషన్ ప్రొఫెసర్ డా. ఫ్రాంక్ హోల్ పాల్గొన్నారు.
మరో పరిశోధనలో 2018లో జర్నల్ ఆఫ్ నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం వారానికి 150 నిమిషాల పాటు సైక్లింగ్ చేసే మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 12% తక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో పోస్ట్‌డాక్టరల్ ఫెలో డా. షాన్ X. డెంగ్ పాల్గొన్నారు.
మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది: సైక్లింగ్ ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుందని.. ఇవి మానసిక స్థితిని మెరుగుపరచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయమని సలహా ఇస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.