Constipation Cause Heart Problems: హార్ట్ ఎటాక్ సంకేతాలు అంటే.. ఛాతి నొప్పి, ఎడమ చేతి నొప్పి, భుజం నొప్పి, దవడ నొప్పులు, కాళ్ల నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, అలసట వంటివన్నీ వేధిస్తాయని చాలా మందికి తెలుసు. వీటితో పాటు మలబద్ధకం కూడా గుండెపోటుకు సంకేతం అని నిపుణులు అంటున్నారు. దీర్ఘకాలిక మలబద్ధకంతో బాధపడుతున్నవారు వెంటనే అలర్ట్ కావాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి.. మలబద్ధకానికి, గుండె జబ్బులకు మధ్య సంబంధమేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రస్తుత రోజుల్లో చాలా మంది మలబద్ధకం సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. ఈ సమస్య చాలా మందికి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. రోజంతా ప్రశాంతంగా ఉండలేరు. మలవిరసర్జన కాక.. కడుపులో బరువుగా ఉన్నట్టు ఫీలవుతుంటారు. అయితే కొద్దిమంది ఈ సమస్యను తేలికగా తీసుకుంటారు. కానీ, దీర్ఘకాలికంగా మలబద్ధకంతో బాధపడుతున్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. ఎందుకంటే ఈ సమస్య గుండెపోటు లక్షణాలలో ఒకటని పలు అధ్యయనాలు కూడా స్పష్టం చేస్తున్నాయి.
2019లో అమెరికన్ జర్నల్ ఆఫ్ సైకాలజీ- హార్ట్ అండ్ సర్య్కులేటరీ ఫిజియాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం దీర్ఘకాలిక మలబద్ధకం అధిక రక్తపోటును ప్రేరేపిస్తుందని.. తద్వారా గుండెపోటుకు దారితీస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనను మెల్బోర్న్లోని మోనాష్ యూనివర్సిటీ వారు నిర్వహించారు. ఈ పరిశోధనలో మోనాష్ యూనివర్సటీలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో బయోలజికల్ సైన్సెస్ ప్రొఫెసర్ డాక్టర్ ఫ్రాన్సిస్ మార్క్వెస్ పాల్గొన్నారు.
"మలబద్ధకం సాధారణ సమస్యగానే భావించినప్పటికీ ఇది గుండె సంబంధిత వ్యాధులకు దారి తీస్తుందని మా పరిశోధనలో తేలింది. సాధారణంగా అధిక రక్తపోటు, ఊబకాయం, దీర్ఘకాలిక ధూమపానం లాంటివి గుండె సమస్యలకు కారకాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు మలబద్ధకం సమస్య వల్ల కూడా గుండె వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని వెల్లడైంది. సాధారణ వ్యక్తుల కన్నా మలబద్ధకం ఉన్నవారిలో గుండె సమస్య వచ్చే ఛాన్స్ రెండు రెట్లు ఎక్కువ." --డాక్టర్ ఫ్రాన్సిస్ మార్క్వెస్, ప్రొఫెసర్
సంబంధం ఏంటంటే: గుండె పనితీరు మొత్తం శరీర ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందని పరిశోధకులు తెలిపారు. వ్యాయామం చేయకపోవడం, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారం తినడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల మలబద్ధకం సమస్య వస్తుందని వివరించారు. మలబద్ధకం కారణంగా మలవిసర్జన చేసే సమయంలో ఎక్కువగా శ్రమించడం వల్ల అధిక రక్తపోటుకు దారి తీస్తుందని.. ఇది గుండెపై ఒత్తిడిని పెంచుతుందని అంటున్నారు. దీని వల్ల గుండెకు రక్తాన్ని పంపడం కష్టమవుతుందని.. దీర్ఘకాలంలో ఇది గుండె సంబంధిత సమస్యలకు దారి తీయవచ్చని హెచ్చరిస్తున్నారు. మలబద్ధకం, గుండె సమస్యలు వారసత్వంగా కూడా వచ్చే అవకాశం ఉందని తమ పరిశోధనలో తేలినట్లు పేర్కొన్నారు.
మలబద్ధకం తగ్గడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- నీటిని ఎక్కువగా తీసుకోవాలి.
- పైనాపిల్, పుచ్చకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లను తినాలి.
- ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
- రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి.
- తగినంత నిద్రపోవాలి.
- పప్పులు ఎక్కువగా తీసుకోవాలి.
- నాన్ వెజ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.