What Is Popcorn Brain : నేటి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ దాదాపుగా ఉంటుంది. అందులో తప్పకుండా సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి. వీటిలో జనాలు గంటల తరబడి గడిపేస్తున్నారు. ఈ పరిస్థితి ముదిరిపోయి.. చాలా మంది బ్రెయిన్ "పాప్‌కార్న్ బ్రెయిన్"గా మారిపోయిందని నిపుణులంటున్నారు. మరి.. ఏంటీ పాప్‌కార్న్ బ్రెయిన్? దీని నుంచి ఎలా బయటపడాలి ? అనేది ఇప్పుడు చూద్దాం.
మానసిక స్థితిని తెలుసుకోవడానికే :
సాధారణంగా మనం తినే పాప్‌కార్న్‌ను వేయించేటప్పుడు అవి చిన్నపాటి టపాసుల్లాగా పేలుతూ చెల్లచెదురుగా ఎగరి పడుతూ ఉంటాయి. అదే పనిగే ఇంటర్నెట్, సోషల్ మీడియాను ఉపయోగించే వారి మనస్తత్వం కూడా పాప్‌కార్న్‌లాగా మారిపోతోందని అంటున్నారు నిపుణులు. కొంత సేపు వాట్సప్‌లో చాటింగ్ చేసి, మరికొంత సేపు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూడడం, ఇంకొంత సేపు ఫేస్‌బుక్‌లో ఎవరు కొత్త పోస్ట్ పెట్టారని సెర్చ్ చేయడం వంటి పనులు చేస్తూ ఉండడం వల్ల.. వారి మానసిక స్థితి చంచలంగా మారిపోతోందని చెబుతున్నారు. ఈ కండీషన్ గురించి చెప్పడానికే "పాప్‌కార్న్ బ్రెయిన్" అనే పదాన్ని ఇటీవల ఎక్కువగా వాడుతున్నారు.
ఈ పాప్‌కార్న్ బ్రేయిన్ వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి ?
ఆలోచల్లో మార్పు : దీర్ఘకాలం పాటు మన మెదడు "పాప్‌కార్న్ బ్రెయిన్"గా మారిపోతే.. పలు రకాల మానసిక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. చేసే పనిపై ఏకాగ్రత తగ్గుతుంది. పరధ్యానం పెరిగిపోతుంది. ఆలోచన తీరులో ఊహించలేని మార్పులు కలుగుతాయని చెబుతున్నారు.
ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి :
రోజులో ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడపడం వల్ల.. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందట. దీనివల్ల ఎప్పుడూ చికాకు, గందరగోళం కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది :
మన మెదడు పాప్‌కార్న్ బ్రెయిన్‌గా మారిపోతే.. జ్ఞాపకశక్తి తగ్గిపోయే అవకాశం ఉందట. దీంతో.. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా తగ్గిపోవచ్చని హెచ్చరిస్తున్నారు.
ఈ 5 పనులు చేస్తున్నారా? - మీ మెదడుకు తీవ్ర ముప్పు!
రిలేషన్స్ దెబ్బతింటాయి :
పాప్‌కార్న్ బ్రెయిన్‌గా మన మెదడు మారిపోతే వ్యక్తుల మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. ఎలా అంటే వారు పక్కనున్న వారిని పలకరించరు గానీ, ఎక్కడో ఉన్న వారితో మొబైల్‌లో చాటింగ్ చేస్తూ ఉంటారు. అలాగే వారు ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండాలనే ఆలోచనలను ఎక్కువగా కలిగి ఉంటారని నిపుణులంటున్నారు.
లైఫ్ తగ్గుతుంది :
పాప్‌కార్న్ బ్రెయిన్‌గా మనం మారిపోతే చివరికి జీవన ప్రమాణం కూడా తగ్గిపోతుంది. ఎలా అంటే కూర్చున్న చోట నుంచి కదలకుండా ఉండటం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందట. ఇంకా శారీరక శ్రమకు దూరం కావడంతో జీవితం మొత్తం బ్యాటరీ అయిపోయినట్లు తయారవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పాప్‌కార్న్ బ్రెయిన్‌గా మారకుండా ఉండటానికి ఏం చేయాలి ?
- సోషల్ మీడియాను అతిగా వాడుతుంటే, క్రమంగా దానిని తగ్గించుకోవాలి.
- ఇంకా నైట్ సమయంలో గంటల తరబడి ఫోన్ చూడకుండా తొందరగా పడుకోవాలి.
- ఆ సమయంలో పుస్తకాలు చదవడం, కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడటం చేయాలి.
- రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవాలి.
- ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం చేయాలి.
- అలాగే శారీరక శ్రమను కలిగించే పరుగు, నడక, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలను చేయాలి.
హ్యాపీనెస్ ఇక్కడ దొరుకుతుంది - తవ్వుకునోళ్లకు తవ్వుకున్నంత!
పరీక్షల టైమ్‌లో పిల్లలకు ఈ ఫుడ్స్ పెడితే - జ్ఞాపక శక్తి ఓ రేంజ్లో పెరుగుతుంది!