Is Sleeping Too Much Unhealthy: నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదని చాలా మంది ఎక్కువ సేపు పడుకుంటుంటారు. ఇలా గంటల తరబడి నిద్ర పోతే.. లేనిపోని అనారోగ్యాల బారిన పడక తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. వయసును బట్టి నిద్ర సమయాల్ని నిర్ణయించుకుంటే ఎన్నో ఈ సమస్యలు రాకుండా అడ్డుకట్ట వేయచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అతిగా నిద్ర పోవడం వల్ల తలెత్తే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్ర ఎక్కువైతే ఈ సమస్యలు
సాధారణంగా పెద్ద వారికి రాత్రుళ్లు ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర అవసరం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కొంతమంది సమయం దొరికిందనో, ఎక్కువసేపు నిద్ర పోవడం మంచిదన్న ఉద్దేశంతోనో తొమ్మిది గంటలకుపైగా నిద్రపోతుంటారు. ఫలితంగా నిద్ర సమయాలకు అంతరాయం ఏర్పడడంతో పాటు తలనొప్పి కూడా వేధిస్తుందని వివరిస్తున్నారు నిపుణులు. అంతేకాకుండా ఇలా ఎక్కువ సమయం నిద్ర పోవడం వల్ల పగలు నిద్ర రాదని కొందరు అనుకుంటారు. కానీ ఇలా పడుకోవడం వల్ల కునికిపాట్లు వస్తాయని పేర్కొన్నారు.
అతిగా నిద్రపోయే వారిలో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. European Heart Journalలో ప్రచురితమైన "Long sleep duration as a risk factor for cardiovascular disease: a review of the literature" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. కాబట్టి ఎనిమిది గంటలు సుఖ నిద్రకు కేటాయించడమే అన్ని విధాలా శ్రేయస్కరం అని నిపుణులు చెబుతున్నారు.(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
- మన శరీరం చక్కెరను విచ్ఛిన్నం చేసి శక్తిగా మార్చుతుందని.. ఫలితంగా మధుమేహం రాకుండా జాగ్రత్తపడచ్చని నిపుణులు అంటున్నారు. అయితే అతిగా నిద్ర పోవడం వల్ల ఈ వ్యవస్థ గాడి తప్పి.. టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు.
- సుఖంగా నిద్రపోవడం వల్ల ఒత్తిళ్లు, ఆందోళనలు దరిచేరవని నిపుణులు అంటుంటారు. అలాగని గంటల తరబడి నిద్ర కూడా మంచిది కాదని చెబుతున్నారు. దీనివల్ల పలు మానసిక అనారోగ్యాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
- ఇంకా అతి నిద్ర వల్ల శరీరంలో రసాయన చర్యల్ని ప్రేరేపించే న్యూరోట్రాన్స్‌మిటర్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇది జీవ గడియారం పనితీరుని దెబ్బతీసి తద్వారా తలనొప్పి, ఒత్తిళ్లను తెచ్చిపెడుతుందని నిపుణులు చెబుతున్నారు.
- ముఖ్యంగా గంటల తరబడి కదలకుండా పడుకోవడం వల్ల శరీర అవయవాల్లో, కీళ్లలో కదలిక లోపిస్తుందని నిపుణులు అంటున్నారు. ఫలితంగా నడుం నొప్పి, కీళ్ల నొప్పులు తలెత్తే అవకాశం ఉందని వివరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఈ మార్పుల వల్ల ఏటా 2.50 లక్షల మంది మరణించే ఛాన్స్! అవేంటో మీకు తెలుసా?
నడుస్తుంటే తల తిరుగుతుందా? గుండెపై ఒత్తిడి పెరుగుతుందా? ఇలా చేయాలట!