alarm snoozing problems : "ప్రపంచాన్ని జయించిన వారంతా.. జీవితాన్ని గెలిచిన వారంతా.. తెల్లవారు జామున నిద్రలేచిన వారే" ఇది ప్రముఖులు చెప్పే మాట. ఈ మాటలు ఎంతో మంది మీద ప్రభావం చూపుతాయి. అంతే.. "రేపట్నుంచి నేను కూడా సూర్యోదయానికి ముందే పక్క దిగేస్తా" అని నిర్ణయం తీసుకుంటారు. అలారం కూడా సెట్ చేసుకొని పడుకుంటారు. సరిగ్గా సమయానికి అలారమ్ మోగుతుంది. కానీ.. వీళ్లు లేవరు. కాసేపు ఆగి నిద్రలేస్తానంటూ అలారమ్ స్నూజ్‌లో పెట్టేస్తారు. మీరు కూడా ఈ స్నూజ్ బ్యాచ్‌లో సభ్యులా? అయితే.. జీవితంలో ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి అంటున్నారు నిపుణులు! మరి.. ఈ చిన్న అలారమ్ స్నూజింగ్.. జీవితాన్నే ఎలా నాశనం చేస్తుందో ఇక్కడ చూద్దాం.
స్నూజింగ్ వల్ల ఏమవుతుంది?
- ఉదయాన్నే నిద్రలేవాలని అలారం పెట్టుకుని పడుకుంటారు. మోగుతున్న అలారాన్ని స్నూజ్ చేసి పడుకుంటారు. ఆ తర్వాత ఆలస్యంగా నిద్రలేస్తారు. లేచీ లేవడంతోనే ఆలస్యమైపోయిందని హడావిడిగా రెడీ అవుతారు. అలారం మోగినా లేవలేకపోయినందుకు తమను తామే తిట్టుకుంటారు. "రోజూ ఇలాగే జరుగుతోంది! నేనెందుకు ఇంత మొద్దులా తయారవుతున్నాను? దేనికీ పనికి రాకుండా పోతానా?" అనే భయం, బాధ లోలోపల మనసును కొరికేస్తూ ఉంటుంది.
- స్నూజింగ్ చేయడం వల్ల ఆలస్యంగా నిద్రలేచి.. ఆలస్యంగా తాము చేయాలనుకున్న పని మొదలు పెడతారు.
- వాకింగ్ చేయాలనుకున్నవారు చేయలేరు. స్కూల్, కాలేజీ, ఆఫీస్‌కు ఇన్ టైమ్‌లో వెళ్లాలనుకున్నవారు వెళ్లలేరు. తిట్లు తింటారు.
- అనుకున్న పనులు సమయానికి పూర్తి కావు. దాంతో టెన్షన్ పెరిగిపోతుంది. మనసుపై ఒత్తిడి పెరుగుతుంది. కోపం, చిరాకు, భయం, బాధ లాంటి భావోద్వేగాలతో బాధపడతారు.
- ఈ ప్రెజర్ మీ జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది. చిన్న చిన్న విషయాలు మరిచిపోతుంటారు. ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే డిమెన్షియా వంటి పరిస్థితులు తలెత్తొచ్చు.
- దీనివల్ల.. మీ ఏకాగ్రతపై ప్రభావం పడుతుంది. మీ సమర్థత కొద్దికొద్దిగా దెబ్బతినడం మొదలవుతుంది. నాకేదో అయిపోతోందని మీలో హైరానా పెరుగుతుంది.
- అలారం స్నూజ్ చేసే వారు రాత్రిళ్లు తక్కువ నిద్రపోతారని.. పగటిపూట నీరసం, చిరాకు అనుభవిస్తారని ఓ రీసెర్చ్ తేల్చింది. డేవిడ్ క్లెయిన్‌బర్గ్ నేతృత్వంలోని ఈ పరిశోధన 2013లో "జర్నల్ ఆఫ్ స్లీప్ రీసెర్చ్"లో పబ్లిష్ అయ్యింది.
స్నూజింగ్ చేయాలని మనసు ఎందుకు కోరుతుంది?
- ఉదయాన్నే నిద్రలేవాలని అనుకున్నది మీరే.. అలారం సెట్ చేసుకున్నది మీరే.. పొద్దున నిద్రలేవకుండా అలారం నోరు మూయిస్తున్నది మీరే! ఎందుకిలా అంటే.. దానికి పలు కారణాలు ఉన్నాయి.
- మొదటి కారణం మీరు రాత్రి తగినంత నిద్రపోవట్లేదు. దీని కారణంగా మీ శరీరం మరింత విశ్రాంతి కావాలని కోరుకుంటుంది. కాబట్టి.. అప్రయత్నంగానే మీ చెయ్యి స్నూజ్ ఆప్షన్ నొక్కేస్తుంది.
- మానసిక ఒత్తిడి మరో పెద్ద కారణం. మీరు జీవితం గురించి కావొచ్చు, మరేదైనా సమస్య గురించి కావొచ్చు.. ముగింపు అన్నదే లేకుండా అతిగా ఆలోచిస్తూ ఉంటే.. మనసు తీవ్రంగా అలసిపోతుంది. ఎక్కడా ఆపకుండా బండి నడిపితే ఎలా వేడెక్కుతుందో.. బ్రెయిన్ కూడా అలాగే వేడెక్కుతుంది. ఇలా ఆలోచిస్తూ ఎప్పుడో అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రలోకి జారుకుంటే.. మెదడుకు విశ్రాంతి ఎప్పుడు లభించేది? అందుకే.. ఇంకాసేపు పడుకుంటా అంటుంది. చెయ్యి స్నూజ్ మీదకు వెళ్లిపోతుంది.
- సోషల్ మీడియా, వీడియోలు, రీల్స్ అంటూ.. అర్ధరాత్రి దాకా ఫోన్లు పట్టుకొని జాగారం చేస్తుంటారు చాలా మంది. ఈ అలవాటు కూడా మీ రేపటి రోజును ఈ రాత్రే నాశనం చేస్తుంది. మీరు ఎంత మెలకువగా అంటే.. బ్రెయిన్‌ను అంతగా హింసిస్తున్నట్టు. అంత ఇబ్బంది పడిన మనసు ఉదయాన్నే తాజాగా ఎలా ఉంటుంది?
- కొన్నిసార్లు పెద్దగా అలసట లేకపోయినా.. నిద్ర లేచే పరిస్థితి ఉన్నా.. స్నూజ్ ఆప్షన్ నొక్కేస్తారు. దీనికి కారణం ఏమంటే వ్యసనం! అవును.. స్నూజింగ్ వ్యసనం. మీరు గతంలో దీన్ని వాడీ వాడీ.. స్నూజింగ్కు బానిసగా మారిపోయారన్నమాట. అందుకే.. నిద్ర లేవడానికి అవకాశం ఉండి కూడా లేవలేకపోతుంటారు.
ప్రతిదానికీ లింకు..
- రాత్రి త్వరగా నిద్రపోక పోవడానికీ.. ఉదయం లేవలేకపోవడానికీ.. నిరంతర ఆందోళనకు.. మూడీగా ఉండడానికీ.. ఇంటర్ లింక్ ఉంటుంది. ఒకదానికి మరొకటి కారణం అవుతుంది.
- ఫోన్ చూస్తూ ఉంటే నిద్ర త్వరగా రాదు. ఆలస్యంగా పడుకునే ముందే.. హబ్బో మళ్లీ త్వరగా నిద్రలేవాలి అనే టెన్షన్ మొదలవుతుంది.
- ఆ టెన్షన్ సరిగా నిద్రపోనివ్వదు. అలారం మోగే టైమ్ అయ్యిందేమో అని పదే పదే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ విధంగా అలారం సౌండ్ చేయగానే స్నూజింగ్ నొక్కేసి, లేదా ఆఫ్ చేసి పడుకుంటారు. పడుకుంటారు గానీ.. మనసు మాత్రం ప్రశాంతంగా ఉండదు.
- తిరిగి మెలకువ వచ్చేసరికి టైమ్ దాటిపోయి ఉంటుంది. గబగబా లేవడంతో మొదలయ్యే టెన్షన్.. ఆ రోజంతా కొనసాగుతుంది.
- ఇవన్నీ మీరు చేస్తున్న పని మీద.. దాని ఫలితం మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. సరైన రిజల్ట్స్ రానప్పుడు.. బాస్ మిమ్మల్ని తిట్టినప్పుడు.. మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ ఉంటారు. ఇది క్రమంగా మీ టాలెంట్ పైనే అపనమ్మకం పెంచుతుంది. ఇది ముదిరితే మీరు ఎందుకూ పనికిరాని వారంటూ.. మీకు మీరే తీర్మానించుకునే ప్రమాదం కూడా ఉంటుంది. చూశారా.. అలారం స్నూజింగ్ వల్ల ఎంత నష్టం ఉందో!
ఎలా బయటపడాలి?
- ముందుగా టెన్షన్ వదిలేయండి. జీవితాన్ని సానుకూలంగా తీసుకోండి. ఎవరి మెప్పు కోసమో బతకడం బంద్ చేయండి. మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటో ఆలోచించండి. మీకు ఇష్టమైన పని చేయండి.. లేదంటే చేస్తున్న పనినే ఇష్టపడండి. ఏ మనిషి కూడా పర్ఫెక్ట్ కాదని తెలుసుకోండి. జీవితంలో చిన్న చిన్న ఆనందాలు వెతుక్కుంటూ సంతోషంగా ఉండడం అలవాటు చేసుకోండి.
- ఏది ఏమైనా రాత్రి పలానా సమయానికి నిద్రపోవాలని నిర్ణయించుకోండి. ఎన్ని పనులున్నా పక్కన పడేసి.. ఆ టైమ్‌కు పక్క ఎక్కేయండి. మొదట్లో కష్టంగా ఉంటుంది. కానీ.. త్వరగానే అలవాటవుతుంది.
- పడుకోవడానికి కనీసం గంట ముందు ఫోన్ అవతల పడేయాలని మీకు మీరే డెసిషన్ తీసుకోండి. ఆ నిర్ణయం మీరకండి. కావాలంటే అలవాటయ్యేదాకా స్విచ్ఛాఫ్ చేయండి.
- మీకు నచ్చిన టోన్‌ను అలారంగా పెట్టుకోండి. అలారం చేతికి అందేలా కాకుండా దూరంగా అవతలి గదిలో పెట్టండి.
- సండే, సెలవు రోజుల్లో పని ఉండదు కదా అని చాలా మంది కాసేపు ఎక్కువగా పడుకుందామని అనుకుంటారు. ఇలా అస్సలే చేయకూడదు. దీనివల్ల మీ సైకిల్ దెబ్బ తింటుంది. ఏం జరిగినా.. రోజూ అదే సమయానికి నిద్రలేవాలని రూల్ పెట్టుకోండి.