Blood Clots in Eyes : కొంత మంది కళ్లలో ఎరుపు మచ్చలు కనిపిస్తాయి. వీటిని చూస్తే.. కంటికి ఏదో అవుతోందనే భయం కలుగుతుంది. దృష్టిమీద ప్రభావం పడుతుందా? అనే ఆందోళన మొదలవుతుంది. మరి, ఇలాంటి ఎర్ర మచ్చలు కంటిలో ఎందుకు ఏర్పడతాయి? వాటితో ఎలాంటి ప్రమాదం ఉంది? ఎందుకు వస్తాయి, ఎలా తగ్గించుకోవాలి? అనే విషయమై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఇలాంటి సమస్యను "సబ్‌కంజంక్టివల్ హేమరేజ్" అంటారని హార్వర్డ్ ఉమెన్స్ హెల్త్ వాచ్ ఎండీ టోనీ గోలెన్ చెబుతున్నారు. కంటిలో రక్తనాళం ఎఫెక్ట్ అయినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుందట. అయితే.. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కంటిలో ఇది ఏర్పడినప్పుడు భయంగానే ఉంటుందని, అయితే.. ఇది కంటి చూపు మీద ఎలాంటి ప్రభావమూ చూపించదని, దృష్టి దెబ్బతినడం వంటిది ఏమీ జరగదని చెబుతున్నారు.
ఇలా వస్తుంది..
ఈ సమస్య బలంగా దగ్గడం లేదా తుమ్మడం ద్వారా కూడా రావొచ్చని చెబుతున్నారు. గట్టిగా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఉపరితలం కింద ఉన్న రక్తనాళాలు బ్రేక్ అవుతాయట. కాంటాక్ట్ లెన్స్‌లు పెట్టుకునే వారిలో ఇలాంటి పరిస్థితి చాలా సాధారణమని గోలెన్ అంటున్నారు. ఈ లెన్స్‌లు ధరించేటప్పుడు, లేదా తీసేటప్పుడు కనుబొమ్మలపై తప్పకుండా ఒత్తిడి ఉంటుందని, అలాంటి సందర్భాల్లో ఈ ఎరుపు మచ్చలు ఏర్పడడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ మేరకు హార్వర్డ్ హెల్త్ వెబ్ సైట్లో ఆర్టికల్ ప్రచురించారు.
కానీ..
అయితే.. ఇలాంటి ఎర్రటి మచ్చలు మాత్రమే ఉంటే ఆందోళన అవసరం లేదని, కానీ.. వేరే ఇతర లక్షణాలు ఏవైనా ఉంటే మాత్రం అలర్ట్ కావాల్సిందేనని సూచిస్తున్నారు. సాధారణంగా.. ఇలా ఏర్పడిన రక్తపు మచ్చలు మాయమవడానికి ఒకటి లేదా రెండు వారాలు పడుతుందని చెబుతున్నారు. ఇలాంటి మచ్చలు ఉన్నప్పుడు కూడా అవసరమైన వారు కాంటాక్ట్ లెన్స్‌లను పెట్టుకోవచ్చట. కానీ.. కన్ను నొప్పిగా ఉన్నా, లేదా మీ చూపులో ఏదైనా తేడా ఉన్నా వెంటనే స్పందించి వైద్యుల వద్దకు వెళ్లాలని సూచిస్తున్నారు.
ఎందుకంటే.. సాధారణంగా ఈ ఎరుపు మచ్చలు ఏర్పడినప్పుడు కంటికి ఎలాంటి ఇబ్బందులూ కలగవు. నొప్పిగా ఉండడం కానీ, దృష్టిలో తేడాలు ఉండడం గానీ జరగదు. దానికి భిన్నంగా నొప్పి కలిగినా, కంటి చూపులో తేడా ఉన్నా.. ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోకుండా వెంటనే డాక్టర్‌ను కలవాలని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
కళ్లద్దాలు రోజు పెట్టుకుంటే చూపు మందగిస్తుందా? సైట్ వస్తే తగ్గించుకోవచ్చా? కళ్లకు ఏం తింటే బెస్ట్?
మీ కళ్లు ఆరోగ్యంగా ఉన్నాయని అనుకుంటున్నారా..! - కంటి ఆపరేషన్ తర్వాత జాగ్రత్తలు