Natural Ways to Avoid Mosquitoes from Home: మామూలు రోజుల్లోనే దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇక వర్షాకాలంలో పరిస్థితి చెప్పలేం. ఫలితంగా డెంగీ, మలేరియా, చికెన్ గున్యా వంటి విషజ్వరాలు విజృంభిస్తాయి. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో పరిస్థితి ఈ విధంగానే ఉంది. అందుకే.. చాలా మంది దోమల బారి నుంచి తప్పించుకునేందుకు మస్కిటో కాయిల్స్, రిపెల్లెంట్స్ వాడుతుంటారు. అయితే.. వీటి వల్ల దోమలు చనిపోతాయేమో గానీ.. మన ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని.. అందుకే.. దోమలను నేచురల్‌గా తరిమికొట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం కొన్న టిప్స్ పాటించమని సలహా ఇస్తున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
కర్పూరం: దోమల బెడద లేకుండా ఉండాలని నిత్యం మస్కిటో కాయిల్స్ వెలిగించే బదులు.. సాయంత్రం కాగానే కిటికీలు, తలుపులు మూసి కాస్త కర్పూరం, వేప ఆకులు కలిపి పదిహేను నిమిషాల పాటు పొగ వేస్తే చాలంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల దోమలు మళ్లీ ఇంట్లోకి రావంటున్నారు. ఒకవేళ వేప ఆకులు లేకపోతే కర్పూరంతో పొగ వేసినా సరిపోతుందని సూచిస్తున్నారు.
లావెండర్ నూనెతో : దోమలకు లావెండర్ నూనె అస్సలు నచ్చదు. ఈ వాసన ఉన్నచోట నుంచి అవి పారిపోతాయి. కాబట్టి, ఇంట్లో లావెండర్ నూనె స్ప్రే చేయండి. దోమలు మరీ ఎక్కువగా ఉంటే.. లావెండర్ ఆయిల్‌ని చేతులు, కాళ్లకు రాసుకోండి. ఇలా చేస్తే ఒక్క దోమ కూడా మిమ్మల్ని కుట్టదు. 2014లో Phytotherapy Research జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం లావెండర్ నూనె దోమలను తరిమికొట్టడంలో ప్రభావవంతంగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో కొరియాలోని సియోల్ నేషనల్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ డాక్టర్ Wan-Su Choi పాల్గొన్నారు.
వర్షాకాలంలో దోమలకు మస్కిటో కాయిల్స్, రిపెల్లెంట్స్ వద్దు - ఇలా చేస్తే ఒక్క దోమ కూడా కుట్టదు!
సాంబ్రాణి: అరోమాల్యాంప్స్‌లో కర్పూరం, సాంబ్రాణి, వేప నూనె, యూకలిప్టస్ ఆయిల్, లెమన్ గ్రాస్ నూనె, లావెండర్ నూనె.. వీటిలో ఏదైనా ఒకటి వేసి పెట్టుకుంటే.. ఇంట్లో పరిమళాలు వెదజల్లడంతో పాటు దోమల బెడద కూడా ఉండదని అంటున్నారు.
పెప్పర్‌మెంట్ ఆయిల్: ఇది కూడా ఇంటి నుంచి దోమలను తరిమి కొట్టేందుకు ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం ఓ స్ర్పే బాటిల్ నీరు పోసి అందులో కొద్దిగా పెప్పర్‌మెంట్ నూనె(National Library of Medicine రిపోర్ట్) ఇష్టమైతే ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్స్‌ను కలిపి ఇంట్లో స్ప్రే చేస్తే దోమల బెడద ఉండదంటున్నారు.
వెల్లుల్లి రెబ్బలు: కూరల రుచిని పెంచేందుకు ఉపయోగించే వెల్లుల్లి.. దోమలను నివారిస్తుందని నిపుణులు అంటున్నారు. అందుకోసం నాలుగు వెల్లుల్ల్లిపాయలను దంచి, ఏదైనా కొంచెం నూనె లేక నెయ్యితో పాటు కాస్తంత కర్పూరం కలుపుకొని వెలిగించుకుంటే ఆ పొగకు దోమలు నశిస్తాయని చెబుతున్నారు. లిక్విడ్ రీఫిల్స్, మస్కిటో మ్యాట్స్ కంటే ఈ చిట్కా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందంటున్నారు.
కలబంద: ఇంటి చుట్టూ తులసి, వేప, యూకలిప్టస్.. వంటి చెట్లు ఉంటే దోమల శాతం తగ్గుతుందని అంటున్నారు. ఒక కుండీలో కలబంద మొక్క పెంచుకుంటే దోమ కాటుకి ఔషధంలా పని చేస్తుందని.. దోమ కుట్టిన ప్రాంతంలో కలబంద గుజ్జును రాస్తే వెంటనే ఉపశమనం లభిస్తుందంటున్నారు. అలాగే తులసి ఆకులు లేదంటే వేప ఆకుల పేస్ట్‌ని రాసినా ఆ ప్రాంతంలో దద్దుర్లు, దురద.. వంటివి రావని సలహా ఇస్తున్నారు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
దోమలతో నిద్రలేని రాత్రులా? - ఈ 4 మొక్కలు పెంచితే చాలు - అన్నీ ఔట్!