Weather Change Effect on Health: శీతాకాలం, వానకాలం, ఎండకాలం.. ఇలా కాలాలు మారినప్పుడల్లా కొన్ని రకాల జబ్బులు వస్తుంటాయి. కాలాల మాదిరిగానే వాతావరణ మార్పు సైతం ఆరోగ్యం మీద గణనీయ ప్రభావం చూపుతోందని నిపుణులు చెబుతున్నారు. వాతావరణ మార్పులతో తలెత్తే జబ్బులతో 2030 కల్లా ప్రపంచవ్యాప్తంగా ఏటా 2.50 లక్షల మంది మరణించే ప్రమాదముందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అలాంటి జబ్బులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె జబ్బులు: వాతావరణ మార్పుతో దీర్ఘకాలం అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరంలో నీటిశాతం తగ్గటం, రక్తపోటులో మార్పు, కిడ్నీ జబ్బులకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. ఇవన్నీ గుండె మీద విపరీత ప్రభావం కలిగిస్తాయని.. ఫలితంగా గుండెలయ దెబ్బతినటం, గుండెపోటు, గుండె వైఫల్యం, పక్షవాతం వంటి జబ్బుల ముప్పు పెరుగుతుందన్నారు. వడదెబ్బ కూడా గుండెకు హాని చేసేదేనని చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో గర్భిణులకూ గుర్రపువాతం, నెలలు నిండక ముందే కాన్పవటం, గర్భస్రావం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
శ్వాస సమస్యలు: వాతావరణ మార్పుతో గాలి కాలుష్యం తీవ్రమై దుమ్ము, అలర్జీ కారకాలు పెరగటానికీ దారితీస్తాయని.. ఫలితంగా శ్వాస సమస్యలూ విజృంభిస్తాయన్నారు. ఇప్పటికే ఆస్థమా, సీవోపీడీ సమస్యలుంటే మరింత తీవ్రమవుతాయని The European Respiratory Journalలోని Climate change and respiratory disease అధ్యయనంలో తేలింది. తొలిసారిగా అలర్జీలు, అలర్జీతో ముడిపడిన ఉబ్బసం కూడా తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. గాలిలో ఆక్సిజన్ అంతగా లేకపోవటం, ఊపిరితిత్తుల మీద భారం పడి గుండె ఇంకాస్త తీవ్రంగా పనిచేయాల్సిన పరిస్థితీ తలెత్తుతుందని అంటున్నారు. అధిక ఉష్ణోగ్రతలే కాకుండా.. ఉష్ణోగ్రత బాగా పడిపోవటమూ సమస్యలు తెచ్చిపెడుతుందని వివరించారు. శరీరం వెచ్చగా ఉండటానికి గుండె మరింత ఎక్కువగా రక్తాన్ని పంప్ చేస్తుంటే.. చల్లగాలితో ఊపిరితిత్తులు పట్టేస్తాయని నిపుణులు పేర్కొన్నారు.
కీటకాలతో ఇబ్బందులు: మనకు అధిక ఉష్ణోగ్రతలు ఇబ్బందికరంగా ఉన్నా.. జబ్బులను వ్యాపింపజేసే కీటకాలు, పురుగులకు మాత్రం చాలా ఇష్టం. ఉష్ణోగ్రత పెరగటం వల్ల లైమ్ డిసీజ్ వంటి వాటిని వ్యాపింపజేసే పురుగులు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తాయని నిపుణులు అంటున్నారు. చలి కాలంలో చలి అంతగా లేకపోతే దోమలు ఎక్కువకాలం జీవించడమే కాకుండా బాగా వృద్ధి చెందుతాయని వివరించారు. ఫలితంగా డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
నీటితో వచ్చే వ్యాధులు: వాతావరణ మార్పుతో అనూహ్యంగా తుపాన్లు, వరదలు సంభవిస్తుంటాయని నిపుణులు అంటున్నారు. ఇవి బ్యాక్టీరియా, పరాన్నజీవుల వంటివి పెరగటానికి మంచి అవకాశం ఇస్తాయని చెబుతున్నారు. ఇంకా కలుషితమైన నీటితో తీవ్ర కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి రకరకాల జబ్బులు వస్తాయని పేర్కొన్నారు. కొన్నిసార్లు ఇవి ప్రాణాంతకంగానూ పరిణమిస్తాయని హెచ్చరిస్తున్నారు. వాననీటిలో తడవటం వల్ల పాదాలకు, కాళ్లకు సెల్యులైటిస్ వంటి సమస్యలూ వస్తాయని అంటున్నారు.
ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు: వేడి, పొడి వాతావరణాల్లో విజృంభించే ఫంగస్‌లకు అధిక ఉష్ణోగ్రతలు వరం’గా మారతాయని నిపుణులు చెబుతున్నారు. కొత్త ప్రాంతాలకు ఫంగస్ విస్తరిస్తుండటం వల్ల ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు పెద్ద ప్రమాదంగా మారుతున్నాయని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా కొత్త ఫంగస్‌లు పుట్టుకురావటం, మరింత వేడిని తట్టుకునేలా మారటమూ కనిపిస్తోందని వివరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
నడుస్తుంటే తల తిరుగుతుందా? గుండెపై ఒత్తిడి పెరుగుతుందా? ఇలా చేయాలట!
గర్భిణీలకు డయాబెటిస్తో ప్రమాదం! తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యానికి ముప్పు!!