Uric Acid Control Tips In Ayurveda : రక్తంలోని ప్యూరిన్ల విచ్ఛిన్నం ద్వారా ఉత్పత్తి చేయబడే రసాయనమే యూరిక్ యాసిడ్. ఒక్కమాటలో చెప్పాలంటే రక్తంలో కనిపించే వ్యర్థ పదార్థం యూరిక్ యాసిడ్. సాధారణంగా ఇది మూత్రం ద్వారా బయటకు వెళుతుంది. మూత్రం ద్వారా బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో ఇది శరీరంలోనే పేరకుపోయి సమస్యత్మకంగా మారుతుంది. దీన్నే హైపర్యూరిసెమియా అని పిలుస్తారు.
శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల వాపు, నొప్పి, కీళ్ల సమస్యలు, కిడ్నీలో రాళ్లు లాంటి రకరకాల సమస్యలు వస్తుంటాయి. యూరిక్ యాసిడ్ తగ్గించడానికి మార్కెట్లో పలు రకాల మెడిసిన్లు దొరుకుతున్నప్పటికీ ఆయుర్వేద మందులతో దీన్ని సహజంగానే తగ్గించవచ్చట. యూరిక్ యాసిడ్ నియంత్రణలో సహాయపడే కొన్ని ఆకుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆయుర్వేదం ప్రకారం, కొన్ని ఆకులు తినడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థమైన యూరిక్ యాసిడ్ ఎప్పుడూ నియంత్రణలో ఉంటుందట. ఈ ఆకులు కేవలం యూరిక్ యాసిడ్ తగ్గించడమే కాకుండా శరీరంలోని రకరకాల సమస్యలకు చెక్ పెడుతుందట. అవేంటంటే?
1. తులసి:
భారతీయులు పవిత్రమైన మొక్కగా భావించే తులసి ఔషధ గుణాలలోనూ ప్రసిద్ధి గాంచింది. యూరిక్ యాసిడ్ తగ్గించడంలో సహాయపడే యాంటీ ఇన్‌ఫ్లమ్మేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. తులసి ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉంటుంది. యూరిక్ యాసిడ్ శరీరంలో పేరుకుపోకుండా కాపాడుతుంది.
2. వేపాకులు:
శరీరానికి హాని కలిగించే టాక్సిన్లను బయటకు పంపించేందుకు వేపాకులు చక్కటి ఔషధంగా పనిచేస్తాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేయడంలోనూ మంచి పాత్ర పోషిస్తాయి. శరీరంలో పేరుకుపోయిన యూరిక్ యాసిడ్‌తో పాటు ఇతర విష పదార్థాలను కూడా బయటకు పంపించే శక్తి కలిగిన యాంటీ ఆక్సిడెంట్లు వేపాకుల్లో పుష్కలంగా ఉంటాయి.
3. కొత్తిమీర ఆకులు:
ఆయుర్వేదంలో కొత్తిమీర ఆకులకు ప్రాధాన్యం ఎక్కువ. శరీరంలో మంట, వాపు వంటి సమస్యలను తగ్గించేందుకు సహాయపడే సమ్మేళనాలు కొత్తీమీరలో ఎక్కువగా ఉంటాయి. దీన్ని రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ సహా హానికరమైన టాక్సిన్లు సులువుగా బయటకు వెళ్తాయి.
4. త్రిఫల:
త్రిఫల అనేది పేరులో ఉన్నట్లే మూడు పండ్ల కలయిక. అవి బిభీతకి, అమలకి, హరితకి. ఆయుర్వేదం ప్రకారం.. ఇవి యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో సహాయపడే శోథ నిరోధక లక్షణాలకు ప్రసిద్ధి. ఇది పేగుల్లో వాపు, మంటను తగ్గించడంలో బాగా సహాయపడతాయి.
5. గిలోయ్:
ఆయుర్వేదంలో బాగా ప్రసిద్ధి చెందిన మూలిక గిలోయ్. ఇది రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచి కీళ్లనొప్పులు, వాపు, కిడ్నీలో రాళ్లు తగ్గించడంలో గిలోయ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
బాబోయ్ ఎండలు! నీరు తగినంత తాగుతున్నారా? డీహైడ్రేషన్‌ను గుర్తించడమెలా? - Symptoms Of Dehydration