Tips To Remove Spectacle Marks On Nose : ఎక్కువ సేపు ఫోన్‌లు చూడటం, గంటల తరబడి కంప్యూటర్‌ల ముందు కూర్చుని పనిచేయడం వంటి కారణాల వల్ల ఎక్కువ మంది సైట్‌తో ఇబ్బంది పడుతుంటారు. దీంతో ఇష్టమున్నా లేకున్నా కళ్లద్దాలు వాడటం కంపల్సరీ. అయితే, అదేపనిగా కళ్లజోడు పెట్టుకోవడం వల్ల కొంతమందికి ముక్కు మీద మచ్చలు ఏర్పడుతుంటాయి. దీనివల్ల చూడటానికి ముఖం అందంగా కనిపించదు. అయితే, కొన్ని టిప్స్ పాటించడం వల్ల ముక్కు మీద మచ్చలను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
కలబంద రసం : మొటిమలను తగ్గించడానికి, ముఖాన్ని మెరిపించడానికి కలబంద రసం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, దీనిని ఉపయోగించి కళ్లద్దాల వల్ల ముక్కు మీద ఏర్పడే మచ్చలను కూడా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముక్కుమీద మచ్చలున్న చోట రోజూ కలబంద రసం అప్లై చేసుకోవడం వల్ల కొన్ని రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుందని అంటున్నారు. 2016లో "జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ" జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. కళ్లద్దాల వల్ల ముక్కు మీద ఏర్పడిన మచ్చలను తొలగించడంలో కలబంద రసం ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో ప్రముఖ చర్మవ్యాధి నిపుణుడు, యునైటెడ్ స్టేట్స్ లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చర్మవ్యాధి విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ 'డాక్టర్ డేవిడ్ టెన్' పాల్గొన్నారు. కలబంద రసం అప్లై చేసుకోవడం వల్ల కళ్లద్దాల వల్ల ముక్కుపై ఏర్పడే మచ్చలను తగ్గించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
అలర్ట్ : కంటిచూపు మందగిస్తోందా? - ఇలా చేస్తే పిక్చర్ క్లియర్! - Eye Vision Improve Exercises
కీరాదోస : మనం ఫేషియల్స్ వేసుకున్నప్పుడు కళ్లు విశ్రాంతి పొందడానికి.. కూల్‌గా ఉండటానికి కళ్ల పైన కీరాదోస ముక్కలు పెడతాం. అయితే, కీరదోస ముక్కలతో మచ్చలు ఉన్నచోట రుద్దుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే కీరా రసానికి బంగాళాదుంప, టమాటా రసం కలిపి ఈ మిశ్రమాన్ని మచ్చలు ఉన్నచోట అప్లై చేసుకోవాలి. బాగా ఆరనిచ్చి తర్వాత చల్లని నీళ్లతో క్లీన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పద్ధతి కూడా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని అంటున్నారు.
నిమ్మరసం, రోజ్‌వాటర్ : కళ్లజోడు పెట్టుకోవడం వల్ల మచ్చలు ఏర్పడిన చోట నిమ్మరసాన్ని అప్లై చేయడం వల్ల ఈ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. కొద్దిగా నిమ్మరసం తీసుకుని, అందులో కాస్త రోజ్‌వాటర్ కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలున్న చోట అప్లై చేసుకోవాలి. 15 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా డైలీ చేయడం వల్ల నల్లమచ్చలు తగ్గుతాయని నిపుణులంటున్నారు.
రోజ్‌వాటర్, వెనిగర్ : కొద్దిగా రోజ్‌వాటర్ తీసుకొని దానికి కొన్ని వెనిగర్ చుక్కలు కలపండి. ఈ మిశ్రమాన్ని మచ్చలున్న చోట ప్రతిరోజు మర్దన చేసుకోండి. దీనివల్ల తక్కువ టైమ్‌లోనే మచ్చలను తగ్గించుకోవచ్చు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.