Tips To Keep Home Clean Easy : ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, అందంగా అలంకరించకోవడం అంటే చాలా మందికి ఇష్టం. కానీ ఇంటిని, ఇంట్లోని ప్రతి వస్తువును మెరిసేలా చూసుకోవడం అంత సులువైన పని కాదు. చాలా కష్టంతో, సమయంతో కూడుకున్న పని. మరీ ముఖ్యంగా ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో ఒకేసారి అన్ని పనులూ చేసుకోవడం అస్సలు కుదరని పని.కాబట్టి కొన్ని పనులు వెంటనే చేసుకుని మరి కొన్నింటిని విభజించుకొని చేయడం తప్పనిసరి. అలా పనులను డివైడ్ చేసుకుని ప్లాన్ చేసుకుని ఇంటిని, ఇంట్లోని వస్తువులను అందంగా, ఆకర్షణీయంగా మర్చుకునేందుకు మీకు ఉపయోగపడే కొన్ని చిట్కాలు మీ కోసం.
బెడ్ రెడీ చేసుకోవాలి
ఉదయాన్నే లేవగానే మీ మంచాన్ని చక్కగా సర్దుకునే అలవాటు ఉన్నవారు రోజంగా చురుగ్గా, క్రమబద్ధంగా ఉంటారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజూ నిద్రలేవగానే మీరు పడుకున్న మంచాన్ని శుభ్రంగా సర్దుకోండి. కేవలం రెండు నిమిషాల పాటు మీరు చేసే ఈ పని మీ ఇంటిని ఎప్పుడూ అందంగా, ఆకర్షణీయంగా ఉంచేందుకు సహాయపడుతుంది.
బట్టలు ఉతుక్కోవడం
వీకెండ్లో మీ పని తగ్గాలన్నా మీ ఇళ్లు చక్కగా శుభ్రంగా కనిపించాలన్నా మీరు వారానికి కనీసం రెండు సార్లైనా బట్టలు ఉతుక్కోవాలి. ఎప్పటికప్పుడు బట్టలను ఉతుక్కోవడం వల్ల ఇళ్లు చికాకుగా, చిందరవందరగా ఉండకుండా ఉంటుంది.పైగా వారాంతంలో మీకు విశ్రాంతి లభిస్తుంది.
వంటగది
మొత్తం ఇంట్లో తరచూ ఎక్కువగా ఉపయోగించే ప్రదేశాల్లో వంటగది ఒకటి. గజిబిజిగా వంట చేసి ఉరుకులు పరుగులుగా వెళ్లడం వల్ల గదంతా చికాకుగా, అపరిశుభ్రంగా కనిపిస్తుంది. కాబట్టి కాస్త సమయం దొరికినా వంటగది కౌంటరును తుడవడం, గిన్నెలు కడగడం, గదంతా శుభ్రంగా తుడుచుకోవడం వంటివి బద్దకించకుండా ప్రతిరోజూ చేసుకోవాలి.
డైనింగ్ టేబుల్
అందరూ తినడం అయిపోగానే మొదటగా మర్చిపోకుండా డైనింగ్ టేబుల్‌ను శుభ్రంగా తుచుకోవాలి. మిగిలిన ఆహార పదార్థాలను శుభ్రమైన గిన్నెల్లో వేసుకుని టేబుల్ మీద చక్కగా అమర్చడం ద్వారా ఇళ్లంతా శుభ్రంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పైగా టేబుల్ మీద పడిన ఆహార పదార్థాల కారణంగా వచ్చే బ్యాక్టీరియాను అడ్డుకున్నట్లు అవుతుంది.
పరికరాల శుభ్రత
ఇది చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, మిక్సీ, మైక్రోవేవ్ వంటి వాటిని ప్రతి వారం శుభ్రం చేసే సమయం ఉండదు. కానీ వీటిని ఎప్పుడు నీట్‌గా,అందంగా ఉంచుకోక తప్పదు. కాబట్టి నెలకోసారి ఓ రోజును వీటికి కేటాయించి శుభ్రం చేసుకునేలా ప్లాన్ చేసుకోవాలి.
బట్టల అల్మామారా
సీజన్ మారేకొద్దీ అల్మామారాల్లో బట్టలు మార్చక తప్పదు. వాతావరణానికి తగ్గట్టుగా మనం వేసుకునే బట్టలను కూడా మార్చుకోకపోతే ఊపిరి ఆడనట్లుగా, అసౌకర్యంగా అనిపిస్తుంది. కాబట్టి కనీసం రెండు మూడు నెలలకు ఒకసారి బట్టల షెల్ఫులను శుభ్రంగా తుడుచుకుని వచ్చే సీజన్‌కు తగినట్లుగా బట్టలను సర్చుకోవాలి.
రగ్గులు, దుప్పట్లు
పైకి కనిపించప్పటికీ రగ్గులు, దుప్పట్లు, దిండ్లు చాలా త్వరగా మురకిగా మారతాయి. కాబట్టి మీరు తరచుగా వాడే దుప్పట్లు, రగ్గులను వారానికి ఒకసారి తప్పకుండా ఉతుక్కుని, పూర్తిగా ఆరనివ్వండి. తర్వాత చక్కగా సర్చి పెట్టుకోవడం వల్ల ఇళ్లు ఎప్పుడూ సువాసన భరితంగా, అందంగా ఉంటుంది.వీటితో పాటు మీరు హాయిగా ప్రశాంతంగా నిద్రపోయేందుకు సహాయపడతుంది.
చెత్త పడేయడం
చెత్త డబ్బా పూర్తిగా నిండాకే చెత్తను పడేయడం చాలా మందికి అలవాటు. కానీ ఇది అస్సలు మంచిది కాదట. చెత్తను ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంట్లో దుర్వాసన పెరిగి బ్యాక్టీరియా పెరిగి అనారోగ్యసమస్యలకు దారితీయచ్చు.
ఉప్పు నీటితో గదులు తుడవాలి
ఇళ్లు ఎప్పడు శుభ్రంగా, అందంగా కనిపించాలంటే ప్రతి వారం మీరు చేయాల్సిన పని ఒకటుంది. గోరువెచ్చని నీటిని కాసింత ఉప్పు వేసి ఇళ్లంతా తుడుచుకురావాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివిటీని కూడా దూరం అవుతుందని పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.