Tips For Increase Memory Power : మనం జీవితంలో ఎదగడంలో, కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో, కొత్త కొత్త విషయాలను నేర్చుకోవడంలో మెదడు పనితీరు ముఖ్యపాత్ర పోషిస్తుంది. కానీ వాస్తవమేంటంటే వయసు పెరిగే కొద్దీ అందం తగ్గి మెదడు పనితీరు కూడా మందగిస్తుంది. వయసు పైబడే కొద్దీ మతిమరుపు సమస్య కూడా పెరుగుతుంది.ఆలోచన మందగించి చాలా విషయాలు నేర్చుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఒకే సారి రెండు మూడు పనులు చేయలేరు. మానసికంగా చురుగ్గా ఉండలేరు. కొందరికి మాటల మధ్యలో పదాలు కూడా దొరకవు. ఇవన్నీ సాధారణ మతిమరుపు లక్షణాలు. అయితే మీరు క్రమం తప్పకుండా చేసే కొన్ని పనులు వయసు పెరిగేకొద్దీ మీలో కలిగే మానసిక సమస్యలను తగ్గిస్తాయట. అవేంటంటే?
వ్యాయామం
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పని ఏంటంటే వ్యాయామం. రోజూ క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసేవారిలో హిప్పోకాంపస్ పరిమాణం పెరిగి మెదడు చురుగ్గా మారుతుంది. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని కొన్ని అధ్యయనాల్లో తెలిసింది.
ఆరోగ్యకరమైన ఆహారం
మన శరీరంలో ఎలా ఉండాలా అనేది మనం ఏం తింటున్నామనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే వ్యక్తుల్లో అభిజ్ఞా క్షీణత 24 శాతం తక్కువగా ఉంటుందని ఒక అధ్యయనం నిరూపించింది. మీరు మీ జ్ఞాపకశక్తిని కాపాడుకోవాలనుకుంటే, మెదడు చురుగ్గా ఉండాలంటే మీ ఆహారంలో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉండాలి. శుద్ధి చేసిన చక్కెరకు వీలైనంత వరకూ దూరంగా ఉండాలి.
మెదడుకు పదును
మీ జ్ఞాపకశక్తి క్షీణించకుండా ఉండాలంటే ఉత్తమమైన మార్గాల్లో ఒకటి మెదడుకు పదును పెడుతుండటం. పజిల్స్ గేమ్స్ ఆడటం, పుస్తకాలు చదవడం, కొత్త విషయాలను, నైపుణ్యాలను నేర్చుకోవడం, నాడీ సంబంధాలను మెరుగుపరిచే ఆటలు ఆడటం వంటివి తరచు చేస్తుండాలి. ఇవి మానసికంగా వ్యాయామాలుగా పని చేస్తూ మెదడుకు సవాళ్ విసురుతూ చురుగ్గా మారుస్తాయి.
ఒత్తిడికి దూరంగా ఉండటం
అభిజ్ఞా పనితీరు మెరుగ్గా ఉండాలంటే ఒత్తిడి, ఆందోళన వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండాలి. జీవితంలో కలిగే ఎన్నో సమస్యల కారణంగా ఒత్తిడి, ఆందోళనలు మామూలే అయినప్పటికీ వీటి నుంచి ఉపశమనం పొందేందుకు సంగీతం వినడం, పుస్తకాలు చదవడం, ప్రయాణాలు చేయడం, విశ్రాంతి తీసుకోవడం వంటి మీకు నచ్చిన పనులు చేస్తుండాలి.
తగినంత నిద్ర
శారీరక ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి తగినంత నిద్ర చాలా అవసరం. ప్రతి రోజూ కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటలైన తప్పకుండా నిద్రపోవాలి. నిద్ర లేకపోవడం లేదా విరామం లేకుండా నిద్ర పోవడం రెండూ జ్ఞాపకశక్తి కోల్పోయేలా చేస్తాయి. కాబట్టి ఎన్ని పనులున్నా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రశాంతంగా నిద్ర పోవడం లక్ష్యంగా పెట్టుకోవాలి.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మెట్లు ఎక్కడం వల్ల ఇన్ని ప్రయోజనాలా! తెలిస్తే అసలు లిఫ్ట్ వైపే చూడరు!! - Stair Climbing Benefits
గుడ్లలో వీటిని కలిపి జుట్టుకు అప్లై చేస్తే చాలు- స్మూతీ హెయిర్ గ్యారెంటీ! - Eggs For Hair Health