Warning Signs of Not Eating Enough : మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ సరైన పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. అలా తీసుకున్నప్పుడే శరీరానికి కావాల్సిన పోషకాలు అంది హెల్దీగా ఉంటాం. అలాగని.. అతిగా తిన్నా ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో మనందరికీ తెలిసిన విషయమే. అయితే, ఎక్కువగా తినడం మాత్రమే కాదు.. తక్కువ తినడం కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ముఖ్యంగా రోజూ తగినంత ఆహారం తినకపోవడం వివిధ శారీరక, మానసిక సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. పలు అధ్యయనాల్లో కూడా ఈ విషయం వెల్లడైంది. అందులో ప్రధానంగా ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిదంటున్నారు. ఇంతకీ, తక్కువ ఆహారం తీసుకుంటున్నట్లు తెలిపే ఆ హెచ్చరిక సంకేతాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తక్కువ శక్తి స్థాయిలు : మీరు రోజూ తగినంత ఆహారం తీసుకోకపోతే శరీరంలో శక్తి స్థాయిలు తగ్గిపోతాయి. ఫలితంగా ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మన బాడీలో శక్తి స్థాయిలు తగ్గడం వల్ల వ్యాయామం, రోజువారీ పనులు, ఇతర పనులు చేసుకోవడానికి ఇబ్బంది ఏర్పడుతుంది. ఏ పనిచేయాలన్నా బాగా అలసట ఫీలింగ్ కలుగుతుందంటున్నారు నిపుణులు.
తక్కువ బరువు : డైలీ సరిపడా కేలరీలు ఉండే ఆహారం తీసుకోనప్పుడు తక్కువ బరువుని కలిగి ఉండవచ్చంటున్నారు. కాబట్టి, మీ బాడీ మాస్ ఇండెక్స్ చెక్ చేసుకొని అందుకు తగినట్లు ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. అయితే, తక్కువ బరువు ఉండడానికి తగినంత తినకపోవడం ఒక్కటే కాదు ఇతర కారణాలు ఉండొచ్చని గమనించాలి.
జుట్టు రాలడం : మీరు జుట్టు ఎక్కువగా రాలే సమస్యతో బాధపడుతున్నారా? అందుకు తగినంత ఆహారం తీసుకోవడం కూడా ఒక కారణంగా భావించవచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కేలరీలు, ప్రొటీన్లు, బయోటిన్, ఐరన్, ఇతర కావాల్సిన పోషకాలు తగినంత తీసుకోకపోవడం జుట్టు రాలడానికి కారణం కావొచ్చంటున్నారు.
మానసిక ఆరోగ్య సమస్యలు : పోషకాహారం పరంగా ఏం తింటాం, ఎంత తింటాం అనేది కూడా మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా సరైన పోషకాహారం తీసుకోకపోవడం చిరాకు, ఒత్తిడి వంటి వివిధ మానసిక సమస్యలను కలిగిస్తుంది! అంతేకాదు, 2020లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సభ్యుల బృందం జరిపిన ఒక అధ్యయనంలో కూడా ఇదే విషయం వెల్లడైంది. అందుకు సంబంధించిన రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎల్లప్పుడూ చల్లగా అనిపించడం : ఇది కూడా తగినంత ఆహారం తీసుకోకపోవడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. కాబట్టి, మీలో ఈ లక్షణం కనిపించినా అశ్రద్ధ చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదట.
మలబద్ధకం : తక్కువ తినడం, కఠినమైన డైటింగ్ ఫాలో అవ్వడం వల్ల మలబద్ధకం సమస్య తలెత్తుతుందంటున్నారు. మలం ఏర్పడటానికి తక్కువ వ్యర్థ ఉత్పత్తి, జీర్ణవ్యవస్థ ద్వారా ఆహారం నెమ్మదిగా కదలడమే అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. 2022లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సభ్యుల బృందం కూడా ఇదే విషయాన్ని ఓ అధ్యయనంలో స్పష్టం చేసింది. అందుకు సంబంధించిన రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
చర్మ సమస్యలు : తగినంత ఆహారం తీసుకోకపోవడం చర్మంపై కూడా ప్రతికూలంగా ప్రభావం చూపుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది చర్మం థిన్‌గా మారడానికి, ముడతలు పడటానికి కూడా కారణమవుతుంది. అలాగే.. చర్మం కింద గాయాలు, రక్త నాళాలు దెబ్బతినడం వంటి సమస్యలను కలిగించవచ్చంటున్నారు నిపుణులు.
ఇవేకాకుండా.. సరైన పోషకాహారం తీసుకోకపోవడం మూలంగా తరచుగా అనారోగ్యం, పిల్లల్లో బలహీనమైన పెరుగుదల, ఆకలి సూచనలలో మార్పులు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవీ చదవండి :
ఇది తాగితే మీ బాడీ క్లీన్ అవుతుందట! మలినాలు పోయి ఫ్రెష్‌గా ఉంటారట!
మీకు నిద్రలో చెమటలు పడుతున్నాయా? లేట్ చేయకుండా ఆస్పత్రికి వెళ్తే బెటర్!