Health Issues behind Sweat in Sleep : సమ్మర్లో వేడి వాతావరణం, గాలి సరిగ్గా రాకపోవడం వల్ల ఉక్కపోయడం కామన్. అలాగే ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు చెమటలు వస్తుంటాయి. కానీ కొంతమందికి రాత్రుళ్లు చల్లని వాతావరణంలో నిద్ర పోతున్నా.. విపరీతంగా చెమటలు పడుతుంటాయి. ఫ్యాన్, ఏసీ ఆన్‌లో ఉన్నా చెమట చికాకు పెడుతుంటుంది. అయితే, చాలా మంది చిన్న సమస్యే కదా లైట్ తీసుకుంటుంటారు. కానీ, అది వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమస్య పెద్దది కాకముందే డాక్టర్‌ను సంప్రదించడం మంచిదంటున్నారు. ఇంతకీ, నైట్ టైమ్ ఉన్నట్లుండి చెమటలు(Sweats) పట్టడం ఏ ఆరోగ్య సమస్యలకు సంకేతమో? ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హైపర్ థైరాయిడిజం : మీకు రాత్రుళ్లు చల్లని వాతావరణంలో చెమటలు రావడం హైపర్ థైరాయిడిజం సంకేతం కావొచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే మన శరీరంలో థైరాయిడ్ గ్రంథి జీవక్రియలతో పాటు ఇతర శారీరక విధులు నిర్వర్తించడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అయితే, అది అత్యంత చురుకుగా మారినప్పుడు హైపర్ థైరాయిడిజం సమస్య వస్తుంది. ఫలితంగా బాడీ వేడికి తట్టుకోలేక చెమటలు వస్తుంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
మానసిక సమస్యలు : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది రకరకాల మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే, అందులో కొన్ని రకాల మానసిక సమస్యలు ఉన్నప్పుడు మనసులో ఒక రకమైన యాంగ్జైటీ, ఆందోళన మొదలవుతుందంటున్నారు నిపుణులు. అది నిద్రలో చెమటలు పట్టేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడి/ఆందోళన : మనం ఒక్కోసారి ఉన్నట్లుండి ఒత్తిడి, ఆందోళనలకు గురవుతుంటాం. అప్పుడు వాటి ప్రభావం మెదడు, శరీరంపై పడుతుంది. ఫలితంగా చెమటలు పడతాయంటున్నారు నిపుణులు. కాబట్టి నిద్రలో చెమటలు పట్టడానికి ఇది కూడా ఓ కారణమే అంటున్నారు నిపుణులు!
మెనోపాజ్ : మహిళల్లో రాత్రుళ్లు నిద్రలో చెమటలు పడుతున్నాయంటే అందుకు మోనోపాజ్ సమస్య కూడా కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా 40 దాటిన మహిళల్లో ఈ సమస్య ఉన్నట్లయితే వారు మోనోపాజ్‌కు చేరువవుతున్నారనడానికి సూచనగా చెప్పుకోవచ్చంటున్నారు. ఎందుకంటే మోనోపాజ్ టైమ్‌లో హార్మోన్ మార్పులు వస్తాయి. దాని వల్ల విపరీతంగా చెమట పడుతుందంటున్నారు నిపుణులు.
రాత్రుళ్లు చెమటలు రావడానికి టీబీ/హెచ్‌ఐవీ, లుకేమియా.. వంటి సమస్యలూ కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ వ్యాధులు ఉన్నప్పుడు ఉన్నట్లుండి శరీరంలో ఉష్ణోగ్రత పెరిగిపోతుందని.. అది నైట్ టైమ్ చెమటకు దారి తీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
బాబోయ్ ఎండలు! నీరు తగినంత తాగుతున్నారా? డీహైడ్రేషన్‌ను గుర్తించడమెలా?
కెఫీన్ అధికంగా ఉండేవి తినడం : కెఫీన్ ఎక్కువగా ఉండే పదార్థాలు మితిమీరి తీసుకోవడం వల్ల కూడా రాత్రుళ్లు చెమటలు పట్టే అవకాశం ఎక్కువని నిపుణులు సూచిస్తున్నారు. 2018లో 'ప్లోస్ వన్(PLOS One)' అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. కెఫీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యత తగ్గుతుందని, రాత్రుళ్లు చెమటలు పట్టే అవకాశం పెరుగుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో ఆస్టిన్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో పనిచేసే న్యూరోబయాలజీ ప్రొపెసర్ డాక్టర్. డేవిడ్ జె. లీ పాల్గొన్నారు. కెఫీన్ ఎక్కువగా ఉండే పానీయాలు, ఫుడ్స్ తీసుకోవడం వల్ల నైట్ టైమ్ చెమటలు పట్టే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
కొన్ని రకాల మందుల వాడకం : యాంటీ డిప్రెసెంట్స్, యాంటీ రెట్రోవైరల్స్, హైపర్‌టెన్షన్ మందులు వాడడం కూడా రాత్రిపూట చల్లని వాతావరణంలో చెమటలు రావడానికి ఓ కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ మందుల వాడకం చెమట గ్రంథుల్ని నియంత్రించే మెదడు భాగాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందంటున్నారు. ఫలితంగా నిద్రలో చెమటలు పడుతుంటాయంటున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
సెలవుల్లో పిల్లలు ఫోన్లో మునిగిపోతున్నారా? - ఇలా చేస్తే ఇక ముట్టుకోరు!